Dry Lips |చిన్నతనంలో ఉండే ఎర్రటి, మృధువైన పెదాలు పెద్దయ్యే కొద్దీ తమ మృధుత్వాన్ని కోల్పోతాయి. కొందరిలో నల్లబడటం కూడా చూడొచ్చు. ఇందుకు అనేక కారణాలు ఉంటాయని, వాటిలో మన జీవనశైలి ప్రధాన పాత్ర పోషిస్తాయని అంటున్నారు వైద్య నిపుణులు. పొడిబారడం, నల్లబడటం, చర్మం ఊడుతుండటం వంటివి అనేక మంది ఎదుర్కొంటున్న సమస్యల్లో చాలా సాధరణంగా తలెత్తుతున్నాయి. కాగా ఈ సమస్యలకు ఎక్కువగా లిప్ పిగ్మెంటేషన్ కారణమవుతుంటుందని చెప్తున్నారు నిపుణులు. ఈ సమస్య రావడానికి అధికంగా కెఫీన్ ఉండే పదార్థాలు తీసుకోవడం, రసాయనాలుండే సౌందర్య ఉత్పత్తులను వాడడం, శరీరంలో మెలనిన్ ఉత్పత్తి అధికమవడం వంటి అనేక కారణాలుంటాయి. అయితే ఇంట్లో దొరికే కొన్ని పదార్థాలతో ఈ సమస్యను దూరం చేసుకోవచ్చని నిపుణులు అంటున్నారు. మరి అవేంటి.. ఎలా వాడాలో ఒకసారి చూద్దాం..
రాత్రి సమయలో పెదాలకు ఆలివ్ ఆయిల్ రాసుకుని పడుకోవడం ద్వారా త్వరగా ఫలితం కనిపిస్తుందని అంటున్నారు నిపుణులు. ఆలివ్ ఆయిల్ పెదాలకు కావాల్సిన తేమను అందిస్తుందని, దాని వల్ల అధరాలు అందంగా తయారవుతాయని నిపుణులు వివరిస్తున్నారు.
అదే విధంగా రాత్రి సమయంలో పెదాలకు కలబంద గుజ్జును రాయడం ద్వారా కూడా నల్లని పెదాల సమస్య నుంచి ఉపశమనం పొందొచ్చని అంటున్నారు వైద్యులు. సాధారణంగా మెలనిన్ స్థాయులను అదుపు చేయడంలో కలబంద అద్భుతంగా పనిచేస్తుందని, దీనిని వినియోగించడం ద్వారా పెదాలు మృధువుగా తయారవడంతో పాటు తమ అసలు రంగును పొందుతాయని చెప్తున్నారు.
నిమ్మరసం, బీట్‌రూట్ రసం వంటి వాటిని పెదాలకు పూసి ఒక అరగంట సమయం ఉంచి కడిగేసుకోవాలి. ఇలా ప్రతి రోజూ చేయడం ద్వారా కూడా మంచి ఫలితాలు ఉంటాయి.
తేనెను పెదాలపై రాసుకుని, అది ఆరే వరకు ఉంచుకోవాలి. రాత్రి పడుకునే ముందు కూడా పెదాలకు తేనె రాసి వదిలేయొచ్చు. ఉదయాన్ని చల్లని నీటితో కడిగేసుకోవాలి. ఇలా తరచుగా చేయడం ద్వారా నల్లటి పెదాల సమస్య తగ్గిపోతుంది.
వీటితో పాటు లిప్‌బామ్‌లు వాడటం వల్ల కూడా నల్లటి, పొడిబారిపోయిన పెదాల(Dry Lips) నుంచి ఉపశమనం పొందొచ్చని అంటున్నారు నిపుణులు. కాకపోతే తీసుకునే లిప్‌బామ్‌లను ఎంచుకునే సమయంలో జాగ్రత్త పాటించాలని, సమస్యకు సరైన లిప్‌బామ్ వాడటం వల్ల సమస్య త్వరగా పరిష్కారమవుతుందని అంటున్నారు నిపుణులు.