ప్రైవేటు వ్యక్తుల ఆస్తులను సమాజ వనరుగా భావించ వచ్చా అన్న కేసు విచారణలో సుప్రీంకోర్టు( Supreme Court) చారిత్రాత్మక తీర్పునిచ్చింది. ఉమ్మడి ప్రయోజనం కోసమని ప్రైవేటు వ్యక్తుల అన్ని ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం సరికాదని న్యాయస్థానం తేల్చి చెప్పింది. ఈ మేరకు 8:1 గా తీర్పును వెలువరించింది. కాకపోతే కొన్ని కేసుల్లో మాత్రం మినహాయింపు ఉంటుందని వివరించింది. సీజేఐ చంద్రచూడ్ నేతృత్వంలోని తొమ్మిది మంది సభ్యుల ధర్మాసనం ఈ మేరకు తీర్పును వెలువరించింది. ఈ కేసు విచారణలో భాగంగా ‘‘ఏ ప్రైవేటు ఆస్తి సమాజ వనరు కాదు. ప్రతి ప్రవేటు ఆస్తి సమాజ వనరే. ఈ రెండు పరస్పరం భిన్నమైన విధానాలు. వీటిపై ప్రస్తుత ప్రైవేటీకరణ, జాతీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని సమకాలీన వ్యాఖ్యానం చేయాల్సిన అవసరం ఉంది’’ అని ధర్మాసనం అభిప్రాయపడింది.
‘‘1950 కాలంలోని ఉన్న భారతదేశాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాఖ్యానం చేయకూడదు. అప్పుడు జాతియీకరణ జరుగుతోంది. ఇప్పుడు పెట్టుబడుల ఉపసంహరణ జరుగుతోంది. ప్రైవేటు పెట్టబడులు ఉన్నాయి. ఇది పరివర్తన. కాబట్టి న్యాయస్థానం వ్యాఖ్యానం కొత్త ఉండాలి. ప్రస్తుత భారత్‌కు అనుగుణంగా ఉండాలి. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని వ్యాఖ్యానం చేయాలి’’ అన్న వ్యాఖ్యలను పునరుద్ఘాటిస్తూనే తీర్పును ఇచ్చింది ధర్మాసనం(Supreme Court).