ఎన్నికలకు సన్నద్ధం అవుతున్న రాష్ట్రాల్లో ఝార్ఖండ్(Jharkhand) కూడా ఒకటి. ఈ ఎన్నికల్లో బీజేపీ జోరుగా ప్రచారం చేస్తోంది. ఈ క్రమంలో ఝార్ఖండ్ ఎన్నికల ప్రచారం కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్(Rajnath singh) కూడా పాల్గొన్నారు. ఈ సందర్బంగా హతియాలో నిర్వమించిన ఎన్నికల ర్యాలీలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు కేంద్రమంత్రి. ఝార్ఖండ్‌లో అధికారంలో ఉన్న జేఎంఎం ప్రభుత్వంపై మండిపడ్డారాయన. రాష్ట్ర అభివృద్ధి విషయంలో ఝార్ఖండ్ ముక్తి మోర్చా(JMM) నేతృత్వంలోని ఇండియా కూటమి టపాసులా పేలితే బీజేపీ శక్తివంతమైన రాకెట్ లా దూసుకెళ్తుందని అన్నారు. తమ వేగంతో రాష్ట్రాన్ని సరికొత్త శిఖరాలకు బీజేపీ తీసుకెళ్తుందని ఆయన అన్నారు. ‘‘జేఎంఎం ఒక మునుగుతున్న పడవ కాబట్టే మండల్ ముర్ము మా పార్టీలో చేరారు. ఇదంతా చూస్తుంటే రాష్ట్రంలో వచ్చేది ఎవరి ప్రభుత్వమో క్లియర్‌గా అర్థమవుతోంది’’ అని వ్యాఖ్యానించారాయన.
‘‘ఝార్ఖండ్‌లోని జేఎంఎం ప్రభుత్వం ఆదివాసీలను అణచివేస్తోంది. వారి ప్రయోజనాలకు విరుద్ధంగా పనిచేస్తోంది. చొరబాటుదారులు రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు. రాష్ట్రంలో ఆదివాసీ జనాభా తగ్గిపోతోంది. బీజేపీ అధికారంలోకి వస్తే ఝార్ఖండ్ అభివృద్ధి చెందుతుంది. ఝార్ఖండ్ అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల సరసన నిలబెట్టే బాధ్యత బీజేపీ తీసుకుంటుంది. 2027 నాటికి ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్.. అమెరికా, చైనా సరసన మూడో స్థానంలో నిలవడం తథ్యం’’ అని తెలిపారాయన(Rajnath singh).