రోగాలకు రాగులు(Finger Millet).. భోగాలకు బియ్యం అన్న నానుడి అక్షర సత్యమంటున్నారు వైద్యులు. రాగులు తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెప్తున్నారు. చాలా మంది తమకు రాగులు పడవని, రాగులు తింటే అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని చెప్తుంటారు. కానీ అది కేవలం స్టార్టింగ్ ట్రబులే తప్ప రాగులతో రోగాలు రావని నిపుణులు అంటున్నారు. కాకపోతే రాగులను జీర్ణం చేసే అంతటి శారీరిక కష్టం చేయకపోతే మాత్రం కాస్తంత ఇబ్బంది పెడతాయని, అప్పటికి కూడా మన శరీరానికి పెద్దగా చెడు చేయవని చెప్తున్నారు. రాగుల్లో ఉండే అమినోయాసిడ్స్ వీటినే ట్రిప్టోఫాన్ అని కూడా అంటారు ఈ అమినో ఆమ్లాల వల్ల ఆకలి తగ్గుతుంది. ఎక్కువ సేపు ఆకలి వేయకుండా ఆపడంలో రాగులు రాజాలు. రాగులతో తయారైన ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థ మందగిస్తుంది. దాని వల్ల అదనపు క్యాలరీలను శరీరం గ్రహించకుండా ఉంటుంది శరీరం. అంతేకాకుండా రాగుల్లో అధికంగా ఉండే ఫైబర్ వల్ల కడుపు నిండిన అనుభూతి త్వరగా కలుగుతుంది. ఇది అధికంగా ఆహారం తీసుకోవడాన్ని నియంత్రిస్తుంది.
మధుమేహం: రాగులను ఎలా తీసుకున్నా మధుమేహానికి చక్కని ఔషదంలా పనిచేస్తుంది. రాగి సంకటి, రాగుల గంజి, రాగి జావ, రాగి రొట్టె ఇలా ఏ రూపంలోనైనా రాగులను తీసుకోవచ్చు. రాగుల్లో(Finger Millet) ఉండే ఫైటోకెమికల్స్ జీర్ణప్రక్రియను నెమ్మదించడంలో సహాయపడుతుంది. దాని వల్ల మధుమేహగ్రస్తుల్లో చక్కెర స్థాయిలు నియంత్రించడం వీలవుతుంది.
కొవ్వు: శరీరంలో అధికంగా పెరిగిన చెడు కొవ్వు స్థాయిలను తగ్గించడంలో కూడా రాగులు అద్భుతంగా పనిచేస్తాయి. రాగుల్లో ఉండే అమైనో యాసిడ్ లెసిథిన్, మేథినోన్.. కాలేయంలో ఉండే అదనపు కొవ్వును తొలగించడంలో బాగా దోహదపడతాయి. దాంతో పాటుగా శరీరమంతటా కొలెస్ట్రాల్ స్థాయిలను తక్కువ చేయడంలో రాగులు దివ్యఔషధంలా పనిచేస్తాయి.
పొట్రీన్: రాగుల్లో ఎక్కువ పాల్లలో ఉండే అమైనో యాసిడ్స్ శరీరంలో సాధారణ కార్యాచరణకు కీలకం. శరీర కణజాలాలకు ఇవి మేలు చేస్తాయి. శరీరంలోని నైట్రోజెన్‌ను సమతుల్యం చేయడంలో కూడా ఇవి దోహదపడతాయి. శరీరానికి కావాల్సిన ప్రొటీన్‌ను అందించి శరీరాన్ని దృఢంగా తయారు చేస్తాయి.
రక్తహీనత: రాగుల్లో సహజ ఐరన్ పుష్కలంగా ఉంటుంది. రాగులు తరచుగా తీసుకోవడం ద్వారా శరీరంలో ఐరన్ స్థాయిలు సహజంగా పెరుగుతాయి. తద్వారా రక్తహీన సమస్యకు చెక్ పెట్టొచ్చని వైద్య నిపుణులు అంటున్నారు.
బలమైన ఎముకలు: రాగుల్లో ఎముకలకు అత్యంత ముఖ్యమైన కాల్షియం పుష్కలంగా ఉంటుంది. దీని వల్ల ఎముకలకు కావాల్సిన కాల్షియం అంది అవి బలంగా తయారవుతాయి. రాగులను పిల్లలకు పెట్టడం కూడా చాలా మంచిదని, పిల్లల్లో సక్రమమైన ఎదుగుదలకు రాగులు ఎంతగానో తోడ్పడతాయని వైద్యులు అంటున్నారు. అంతేకాకుండా వృద్ధాప్యంలోకి అడుగు పెడుతున్న వారికి రాగులు అద్భుత ఆహారంగా పనిచేస్తాయి. మహిళలో ఎముకల పటుత్వానికి రాగులు చాలా మంచివని నిపుణులు వివరిస్తున్నారు.
బీపీ: రక్తపోటును నియంత్రించడంలో కూడా రాగులు బాగా పనిచేస్తాయి. హైబీపీ సహా ఇతర కరోనరీ వ్యాధులతో ఇబ్బంది పడే వారికి ఫైబర్ అధికంగా ఉండే రాగులు ఎంతో మేలు చేస్తాయి. రోజు రాగి మాల్ట్ తీసుకోవడం బీపీ ఉన్న వారికి ఒక టానిక్‌లా పనిచేస్తాయి.
గుండె ఆరోగ్యం: ఉబ్బసం, గుండె బలహీనత, కాలేయ వ్యాధులకు రాగులు బాగా పనిచేస్తాయి. వృద్ధాప్యంలో ఉన్న వారు తరచుగా రాగులు తీసుకోవడం వల్ల వయసు పైబడటం వల్ల వచ్చే అనేక సమస్యలు తగ్గుతాయని, శరీరానికి కావాల్సిన బలం, శక్తిని అందించడంలో రాగులు అద్భుతంగా పనిచేస్తాయని వైద్యులు చెప్తున్నారు.