తెలంగాణలో పత్తి కొనుగోళ్లను వెంటనే ప్రారంభించాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Minister Tummala) ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో పత్తి జిన్నింగ్ మిల్లర్లు సమ్మె ప్రకటించిన నేపథ్యంలో మంత్రి తుమ్మల.. సీసీఐ (కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా), సీఎండీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో సమావేశమయ్యారు. ఈ సందర్బంగా వారికి పలు కీలక సూచనలు చేశారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని అన్నారు. ‘‘సమ్మె కారణంగా పత్తి రైతులు ఇబ్బందులు పడకూడదు. పత్తిని తక్కువ ధరలకు అమ్మాల్సిన పరిస్థితి తలెత్తకూడదు. పత్తి జిన్నింగ్ మిల్లర్లతో చర్చలు జరిపి, పత్తి కొనుగోళ్లు తక్షణమే ప్రారంభించండి. ఈ దిశగా వెంటనే చర్యలు చేపట్టండి. ఇది రైతుల ప్రయోజనాలను కాపాడడంలో కీలకం’’ అని మంత్రి తెలిపారు.