ప్రధాని మోదీ(PM Modi)తో భేటీ కావడంపై భారత విదేశాంగ శాఖ మంత్రి సుబ్రమణియన్ జైశంకర్(Jaishankar) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మోదీతో భేటీ కావడం అంత ఈజీ కాదన్నారు. ప్రతి విషయంపై ప్రధానికి అవగాహన ఉందని చెప్పారు. ఆయనతో భేటీ కావాలంటే ఆ అంశంపై పక్కా సమాచారంతో వెళ్లాల్సిందేనని లేకపోతే చాలా కష్టమవుతుందని వివరించారు. ఈ క్వాలిటీ వల్లే ప్రధాని మోదీ తమ డిమాండింగ్ బాస్ అని చెప్పుకొచ్చారు జైశంకర్. ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రధాని మోదీ ఉద్దేశించి జైశంకర్ మాట్లాడారు. ఈ సందర్బంగానే మోదీతో భేటీ అంటే ఎలా ఉంటుందని వివరించారు. భేటీ అంటే చాలా మంది ఏదో వచ్చాం చర్చించాం అని అనుకుంటారు.. కానీ మోదీతో అలా ఉండదని చెప్పారు.
‘‘ప్రధాని మోదీతో ప్రతిరోజూ మంత్రులు భేటీ అవుతుంటారు. ఆయన సమావేశానికి చర్చించే అంశంపై పక్కా సమాచారం తీసుకునే వెళ్ళాలి. ఎందుకంటే ప్రతి విషయంపై మోదీకి పూర్తి అవగాహన ఉంటుంది. ప్రతి అంశాన్ని కూడా ఆయన చాలా క్షుణ్ణంగా చర్చిస్తారు. వివరణ అడుగుతారు. ఆయన చాలా నిజాయితీ గల వ్యక్తి. అందుకే మోదీ మా డిమాండింగ్ బాస్. ఆయనతో కలిసి పనిచేయడం చాలా సంతోషంగా ఉంది. ఆయన నాయకత్వంలో భారత్ అనేక అంశాల్లో ముందడుగు వేసింది. ప్రపంచంలోని అనేక దేశాలతో భారత్‌కు సత్సంబంధాలు ఉన్నాయి. ఇందుకు మోదీనే కారణం’’ అని అన్నారు జైశంకర్(Jaishankar).