వికారాబాద్ జిల్లా కొడంగల్ మండలం లగచర్ల గ్రామంలో కలెక్టర్ ప్రతీక్ జైన్(Collector Prathik Jain)పై జరిగిన దాడిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) తప్పుబట్టారు. రైతులను ఉగ్రవాదుల తరహాలో అరెస్ట్ చేయడం దుర్మార్గమని అన్నారు. అయితే లగచర్లలో ప్రభుత్వ అధికారులపై దాడి చేసిన ఘటనలో పోలీసులు 55 మందిని అరెస్ట్ చేశారు. వారిలో రైతులు, స్థానికులు ఉన్నారు. ఈ ఘటపైనే తాజాగా కేటీఆర్ ఘాటుగా స్పందించారు. లగచర్ల రైతులకు బీఆర్ఎస్ అండగా నిలుస్తుందన్నారు. అరెస్టులతో లగచర్ల(Lagacharla) లడాయిని ఆపలేరని, బెదిరింపులతో రైతులను భయపెట్టలేరంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆయన ఎక్స్(ట్విట్టర్) వేదికగా రైతులకు మద్దతును ప్రకటించారు.
‘‘అరెస్టులతో లగచర్ల లడాయిని ఆపలేరు!
బెదిరింపులతో రైతులను భయపెట్టలేరు!
అర్దరాత్రి 300మంది పోలీసులను పంపి రైతులను అరెస్ట్ చేస్తారా?
రైతులు ఏమైనా తీవ్రవాదులు అనుకుంటున్నారా?
ఇదేనా ప్రజాస్వామ్య పాలనా?రైతు సంక్షేమ పాలన?
ఇదేనా వెలుగులను తరిమేసి.. చీకట్లు తెచ్చిన ఇందిరమ్మ రాజ్యం !
అర్దరాత్రి అన్నదాతల అరెస్టులు ఎందుకు?
ఫార్మా కంపెనీలు ఏర్పాటు చేసి..
పచ్చని పొలాలను వల్లకాడు చేయవద్దన్నందుకు రైతుల అరెస్టులా?
మీ అల్లుడు, సోదరుల సంపాదనల కోసం..
భూమిని నమ్ముకున్న మా పొట్ట కొట్టవద్దన్నందుకు అరెస్టులా?
రైతుల అరెస్టులను ఖండిస్తున్నాం..పోలీసుల చర్యలను వ్యతిరేకిస్తున్నాం. లగచర్ల గ్రామస్తుల పోరాటానికి బీఆర్ఎస్ అండగా ఉంటుందని హామీ ఇస్తున్నా’’ అని తెలిపారు కేటీఆర్(KTR).