ఉత్తరప్రదేశ్ ఝాన్సీలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మహారాణి లక్ష్మీ బాయి మెడికల్ కాలేజ్(Jhansi Medical College) నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో మంటలు వ్యాపించాయి. దీంతో ఎన్ఐసీయూలో ఉన్న పది మంది చిన్నారులు సజీవ దహనం అవ్వగా… మరో 37 మంది చిన్నారులను ప్రాణాలతో రక్షించారు. మంటలు ఒక్కసారిగా చెలరేగడంతో ఆసుపత్రిలో ఉన్న రోగులు, సిబ్బంది తమ ప్రాణాలను కాపాడుకునేందుకు పరుగులు పెట్టారు. ఈ క్రమంలో ఆసుపత్రిలో స్వల్ప తొక్కిసలాట కూడా చోటు చేసుకుంది.
అగ్ని ప్రమాద సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మంటల ధాటికి ఆ ప్రాంగణమంతా పొగ కమ్మేసింది. జిల్లా కలెక్టర్ అవినాష్ కుమార్ తో పాటు అధికార యంత్రాంగం అంతా లక్ష్మీ బాయి మెడికల్ కాలేజ్(Jhansi Medical College) వద్దకు చేరుకున్నారు. జరుగుతున్న సహాయక చర్యలను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగిందని జిల్లా కలెక్టర్ తెలిపారు. అగ్ని ప్రమాద ఘటనపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.