మహారాష్ట్ర(Maharashtra)లో సరిపడా ఉద్యోగాలు లేకపోవడంపై కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ(Priyanka Gandhi) కీలక వ్యాఖ్యలు చేశారు. దీనంతటికీ బీజేపీనే కారణమని విమర్శలు గుప్పించారు. మహారాష్ట్రకు వచ్చిన ఫాక్స్‌కాన్, ఎయిర్‌బస్ వంటి మరెన్నో ప్రాజెక్ట్‌లను బీజేపీ పక్కా ప్లాన్‌తో గుజరాత్‌కు తరలించిందని ఆరోపించారు. అందువల్లే మహారాష్ట్రలో ఉద్యోగాలు లేకుండా పోయాయని అభిప్రాయపడ్డారు.
మహారాష్ట్రలో 2.5 లక్షలకు పైగా పోస్ట్‌లు ఖాళీగా ఉన్నాయని కూడా చెప్పారు. రాష్ట్రంలోని యువత తమ నైపుణ్యాలను పెంచుకుంటూ, కొత్త విషయాలను నేర్చుకుంటున్నా ప్రభుత్వం మాత్రం వారికి ఉద్యోగావకాశాలు ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. యువతకు ఉద్యోగాలు అందించడంలో, ఉపాధి కల్పించడంలో మహాయుతి కూటమి(Mahayuti Alliance) ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. యువత దృష్టిని మళ్లించడం కోసమే మహాయుతి ప్రభుత్వం.. లడ్కీ, బహిన్ అంటూ పథకాలు తెస్తోందని ఆరోపించారు ప్రియాంక గాంధీ.
‘‘ఐక్యంగా ఉంటే భద్రంగా ఉండొచ్చన్న బీజేపీ నినాదాలు పేదల కోసం కాదు. పెద్ద పెద్ద వ్యాపారాలు చేసే వారి స్నేహితుల కోసం. వారంతా ఐక్యంగా ఉండాలనే బీజేపీ సూచిస్తోంది. ఎవరి అభివృద్ధి కోసం బీజేపీ పాటు పడుతోందో దేశం మొత్తానికి బాగా తెలుసు. పదేళ్ల మోదీ పాలనలో ఎవరు బాగు పడ్డారో కూడా అందరికీ కనిపిస్తూనే ఉంది. ఈ పదేళ్ల పాలనలో రైతులు, కార్మికులు ఏమాత్రం బాగుపడటలేదు. వ్యాపారవేత్తల పరిశ్రమలు మాత్రం మూడు పువ్వులు, ఆరు కాయలుగా విరసిల్లుతున్నాయి.
దేశంలోని ఓడరేవులు, విమానాశ్రయాలు సహా అనేక ప్రధాన కంపెనీలన్నీ కూడా అదానీ ఆధీనంలో ఉన్నాయి. ప్రభుత్వ విధానాలన్నీ కూడా ఒక వ్యక్తికి అనుకూలంగా ఉండేలా మోదీ మార్పులు చేస్తున్నారు. దేశ సంపదను ఒకరికి కేటాయించడానికి చూపించే నిబద్దతను యువతకు ఉద్యోగాలు కల్పించడంలో కూడా మోదీ, బీజేపీ చూపించాలి’’ అని ప్రియాంక గాంధీ(Priyanka Gandhi) సూచించారు.