ఢిల్లీ(Delhi)లో వాతావరణం మారడం మొదలైంది. రాష్ట్రాన్ని పొగమంచు కమ్మేయడం మొదలైంది. ఢిల్లీ గాలి నాణ్యత నాసిరంగా(Air Quality) మారడం స్టార్ట్ అయిపోయింది. ఈ క్రమంలోనే అధికారులు కూడా అలెర్ట్ అయ్యారు. చలికాలం తొలినాళ్లలోనే ఢిల్లీలో ఇటువంటి పరిస్థితులు తలెత్తడం ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది. ఇప్పుడే ఇలా ఉంటే రానున్న రోజుల్లో పరిస్థితులు ఏంటని కంగారు పడుతున్నారు.
ఈ క్రమంలోనే అధికారులు ఢిల్లీలో సోమవారం.. ఆరెంజ్ అలెర్ట్ ప్రకటించారు. దేశరాజధానిలో గాలి నాణ్యత ఈరోజు 481 పాయింట్లకు చేరిందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీని కారణంగా 150 మీటలర్ల దూరంలో ఉన్న వాహనాలు కనిపించడం లేదని స్థానికులు చెప్తున్నారు. ఆదివారం రాత్రి 457గా ఉన్న ఏక్యూఐ.. సోమవారం ఉదయం 7 గంటలకు 481కి చేరింది. దీనిని ‘సివియర్ ప్లస్’ కేటగిరీగా అధికారులు పేర్కొన్నరు.
ఈ నేపథ్యంలోనే ఢిల్లీ(Delhi) ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఈరోజు ఉదయం 8 గంటల నుంచి ఎన్‌సీఆర్ పరిధిలో గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్(GRAP)-4 కింద మరిన్ని నిబంధనలను అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. వీటిలో భాగంగానే నిత్యావసర సరుకులు, సర్వీసులు అందించే ట్రక్కులు మినహా.. మిగిలిన అన్ని ట్రక్కులును ఢిల్లీకి ప్రవేశించడాన్ని నిలిపేశారు. కేవలం ఎల్‌ఎన్‌జీ(LNG), సీఎన్‌జీ(CNG), ఎలక్ట్రిక్, బీఎస్-4 డీజిల్ ట్రక్కులను మాత్రం నగరంలోకి అనుమతించనున్నట్లు కూడా అధికారులు స్పస్టం చేశారు. దీంతో పాటుగానే 10, 12 తరగతుల విద్యార్థులు మినహా మిగిలిన వారందరికీ ఆన్‌లైన్ తరగతులు నిర్వహించాలని కూడా ఢిల్లీ విద్యాశాఖ ఆదేశించింది.
ఈ పొగమంచు.. ఢిల్లీలోని విమాన సర్వీసులపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతోంది. పలు విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఈ నేపథయంలో విమానాయాన సంస్థలు ప్రయాణికులకు కీలక మార్గదర్శకాలు జారీచేశాయి. ప్రయాణికులు తమ ప్రయాణానికి అదనపు సమయం కేటాయించుకోవాలని, ఫ్లైట్ స్టేటస్‌ను ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకుంటూ ఉండాలని వివరించారు.