కాంగ్రెస్ పార్టీపై కార్యకర్తలు కాస్తంత గుర్రుగా ఉన్నారంటూ తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud) కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలోనే సంగారెడ్డి వేదికగా నిర్వహించిన పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మహేష్ కుమార్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఉండే స్వేచ్ఛ మరే ఇతర పార్టీలో లేదని, ఉండదని అన్నారాయన.
ఈ సందర్భంగానే పార్టీపై కార్యకర్తలు గుర్రుగా ఉండటంలో తప్పు లేదని, వారికి ఆ హక్కు ఉందంటూ చెప్పుకొచ్చారు. ఏది ఏమైనా కార్యకర్తలకు పార్టీ ఎప్పుడూ అండగానే ఉంటుందని చెప్పారు మహేష్ కుమార్. కార్యకర్తలు.. సీఎం రేవంత్(Revanth Reddy)ను వ్యతిరేకించినా కూడా అది పార్టీ కోసమే తప్ప వ్యక్తిగతం కాదని వివరించారు. పదేళ్లు రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్(BRS) ఏమి అభివృద్ధి చేశారో చెప్పాలని ప్రశ్నించారు. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 11 నెలల్లోనే ఎంతో అభివృద్ధి మొదలైందని, తెలంగాణ ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ పాలనలోనే రాష్ట్రం అభివృద్ధిని చూస్తోందని వ్యాఖ్యానించారాయన.
‘‘హరీష్ రావు(Harish Rao) చర్చకు సిద్ధమా..? మన ప్రభుత్వంలో ఎన్ని అభివృద్ధి పనులు చేస్తున్నాం. అవన్నీ ప్రతి ఒక్క కార్యకర్త ప్రజలకు వివరించాలి. జనవరిలో కొంతమంది పార్టీ నాయకులకు పదవులు ఇస్తాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో మన సత్తా చాటాలి. అధికారంలోకి వచ్చి 11 నెలల్లోనే ప్రతిపక్షాలు కుట్రలు చేస్తున్నాయి. బీజేపీ, బీఆర్ఎస్ కుమ్మకై కాంగ్రెస్ పార్టీపై కుట్ర పన్నుతున్నాయి. కార్యకర్త కూడా సీఎంని కలిసే వెసులుబాటు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉంది. కార్యకర్తలు నారాజ్ అయితే మేం కుర్చీ దిగాల్సిందే. మరోసారి మనం అధికారంలోకి రావాలి ఢిల్లీలో రాహుల్ గాంధీ(Rahul Gandhi) ప్రధాని కావాలి.
కేసీఆర్(KCR) రాష్ట్రాన్ని ఆగం చేస్తే కాంగ్రెస్ పార్టీ రిపేర్లు చేస్తుంది. బంగారు తెలంగాణ అంటే కేసీఆర్ కుటుంబం మాత్రమే బంగారుమయం అయ్యింది. కాళేశ్వరం ప్రాజెక్టులో బీటలు బారుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ కట్టిన ప్రాజెక్టు 70 ఏళ్లయిన చెక్కు చెదరలేదు. వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణలో బీఆర్ఎస్ ఉండదు. హరీష్ రావు కూడా పక్క చూపులు చూస్తున్నాడు. చివరికి పార్టీలో తండ్రి, కొడుకు, కూతురు తప్ప ఎవరూ మిగలరు’’ అని Mahesh Kumar Goud జోస్యం చెప్పారు.