ఏపీ పోలీసుల విచారణకు ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ(RGV) గైర్హాజరయ్యారు. తనకు నాలుగు రోజుల సమయం కావాలంటూ ఒంగోలు పోలీసులకు వాట్సప్‌లో మెసేజ్ పెట్టారు. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు(Chandrababu), డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan), లోకేష్(Nara Lokesh)పై అసభ్య పోస్ట్‌లు పెట్టిన నేపథ్యంలో ఒంగోలు పోలీసులు.. ఆర్‌జీవీకి నోటీసులు జారీ చేశారు. అంతేకాకుండా మంగళవారం ఒంగోలు సీఐ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే ఈరోజు విచారణకు ఆయన గైర్మాజరయ్యారు. తనకు నాలుగు రోజుల సమయం ఇవ్వండని కోరారు.
సార్వత్రిక ఎన్నికలకు ముందు ‘వ్యూహం’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా చంద్రబాబు, పవన్ వ్యక్తిత్వాలను కించపరిచేలా ఆయన సోషల్ మీడియాలో పలు పోస్ట్‌లు పెట్టారు. వాటిపై ప్రకాశం జిల్లా మద్దిపాడు(Maddipadu) మండల టీడీపీ ప్రధాన కార్యదర్శి రామలింగయ్య.. పోలీసులను ఆశ్రయించారు. ఆర్‌జీవీపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ పోలీసులను కోరారు. ఆయన ఫిర్యాదు మేరకు పోలీసులు.. వర్మ(RGV)పై కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి ఆర్‌జీవీ.. హైకోర్టును ఆశ్రయించినప్పటికీ లాభం లేకపోయింది. ఆయన అరెస్ట్‌ను ఆపలేమని కోర్టు స్పష్టం చేసింది.