ప్రతి ఆదివారం రోజున ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) నిర్వహించే ప్రత్యేక కార్యక్రమం ‘మన్ కీ బాత్(Mann Ki Baat)’. ఇందులో ఆ వారంలో జరిగిన అన్ని విశేషాలను కవర్ చేస్తూ వాటిపై ప్రధాని మోదీ తన అభిప్రాయం చెప్తుంటారు. ఈ ప్రోగ్రామ్ గ్రాండ్ సక్సెస్ కూడా అయింది. ఆదివారం వచ్చిందంటే ప్రధాని మోదీ తన మన్ కీ బాత్లో ఏం చెప్పనున్నారని లక్షలాది మంది వేచి చూస్తుంటారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు(Chandrababu) కూడా అదే బాటలో పయనించాలని ప్రయత్నిస్తున్నారు. ‘మన్ కీ బాత్’ తరహాలోనే ‘మీతో.. మీ చంద్రబాబు’ అనే ప్రోగ్రాం చేయాలని చంద్రబాబు చూస్తున్నారు. ఈ ప్రోగ్రాం ద్వారా రాష్ట్ర ప్రజలతో సీఎం బాబు నేరుగా మాట్లాడనున్నారు. ఈ కార్యక్రమాన్ని సంక్రాంతి నుంచి ప్రారంభించాలని కసరత్తులు జోరుగా సాగుతున్నాయి. ప్రస్తుతం ఈ కార్యక్రమం నిర్వహించాలన్న ఆలోచన చర్చల్లో ఉంది.
అయితే ఇటువంటి ప్రోగ్రామ్లకు చంద్రబాబు(Chandrababu) శ్రీకారం చుట్టడం ఇదేమీ తొలిసారి కాదు. గతంలో 1995-2004 మధ్య ఆయన ‘డయల్ యువర్ సీఎం’ అనే కార్యక్రమం నిర్వహించారు. ఇందులో ప్రజలు నేరుగా సీఎంకు ఫోన్ చేసి తమ కష్టాలను తెలుపుకోవచ్చు. ఇప్పుడు మన్ కీ బాత్, డయల్ యువర్ సీఎం రెండిటినీ కలయికతో ప్రజలతో మమేకం కావడానికి బాబు సిద్ధమవుతున్నారు. అతి త్వరలోనే ప్రజలతో ముఖాముఖి అవుతానని ఆయన అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. ఇందుకు అనుగుణంగా ఏర్పాటు జరుగుతున్నాయని, ఆడియో, వీడియో విధానంలో దీన్ని ప్రసారం చేసే అవకాశం ఉందని చెప్పారు.