Winter Season Foods | చలికాలం వచ్చిందంటే వ్యాధులు పెరుగుతాయి. అందుకు బలహీన పడిన రోగనిరోధక శక్తే కారణం. ఈ సమస్య నుంచి యువత కూడా ఏమీ మినహాయింపు కాదు. చలికాలంలో చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరూ కూడా ఎన్నో ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. చర్మం పొడిబారడం, జుట్టు జీవం కోల్పోవడం, కీళ్ల నొప్పులు అధికమవడం, పాత గాయాలు ఇబ్బంది పెట్టడం, జలుబు, దగ్గు, వైరల్ ఫీవర్స్ ఇలా ఎన్నో సమస్యలు అల్లాడిస్తాయి.
మహిళల్లో వెన్ను నొప్పి కూడా శీతాకాలంలో అధికమవుతుంది. అందువల్లే శీతాకాలమంటే ప్రతి ఒక్కరూ కూడా అనారోగ్యాలతో పోరాటం చేస్తుంటారు. ఇలాంటి సీజనల్ వ్యాధులు రాకుండా ఉండాలంటే కొన్ని ఆహార పదార్థాలను(Winter Season Foods) తప్పకుండా తినాల్సిందేనని వైద్యులు చెప్తున్నారు. ఈ ఆహారాలను తినడం ద్వారా చలికాలం వచ్చే సీజనల్ వ్యాధులకు చెక్ పెట్టొచ్చని, అంతేకాకుండా మన రోగ నిరోధక శక్తిని బలపరచడంలో ఇవి సహాయపడతాయని నిపుణులు చెప్తున్నారు. అవి ఏంటంటే..
బెల్లం, ఖర్జూరం: కీళ్లనొప్పులు, ఎముకల నొప్పితో బాధపడే వారు తమ రోజువారీ ఆహారంలో బెల్లం, ఖర్జూరాన్ని చేర్చుకోవడం ఎంతో ఉపయోగపడుతుంది. వీటిలో ఖనిజాలు, ఫైబర్, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అంతేకాకుండా ఊపిరితిత్తులను కాలుష్యం, ఇన్‌ఫెక్షన్ల నుంచి రక్షించుకోవడానికి బెల్లం తినడం చాలా మంచిది. మన రోజువారీ ఆహారంలో తప్పకుండా బెల్లాన్ని చేర్చుకోవడం చాలా మంచిదని వైద్యులు చెప్తున్నారు.
చిలగడదుంపలు: చలికాలంలో లభించే చిలగడదుంపలను తినడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి. వీటిలో ఫైబర్, విటమిన్ ఎ, పొటాషియం ఉంటాయి. ఇది మలబద్దకం, చలికాలం కడుపులో వచ్చే మంటను దూరం చేస్తాయి. అంతే కాకుండా రోగనిరోధక శక్తిని కూడా పెంచుతాయి.
నెయ్యి: చలికాలంలో రోటీ లేదా అన్నంలో ఒక చెంచా దేశీ నెయ్యి వేసుకుని తినడం కూడా మన ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇంట్లో తయారుచేసిన స్వచ్ఛమైన దేశీ నెయ్యిలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఇవి కీళ్లను లూబ్రికేట్ చేయడంలో, శరీరాన్ని వెచ్చగా ఉంచి చలి నుండి రక్షించడంలో సహాయపడతాయి. అంతేకాకుండా నెయ్యిలో ఉండే కొవ్వు తక్షణ శక్తిని అందిస్తాయి.
ఆవాలు: ఆవాలు, మొక్కజొన్న రోటీలు తినడం రుచికే కాదు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇవి శరీరాన్ని వెచ్చగా ఉంచి చలికాలంలో రోగాల బారిన పడకుండా మన శరీరాన్ని కాపాడతాయి. అంతేకాకుండా వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
మిల్లెట్, రాగి: చలికాలం.. మన ఆహారంలో తప్పకుండా మిల్లెట్స్ ఉండేలా చూసుకోవడం చాలా ముఖ్యమని నిపునులు చెప్తున్నారు. వీటిలో పీచు పదార్థం సమృద్ధిగా ఉంటుంది. దాంతో పాటుగానే గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. దీని కారణంగా ఇది ఇన్ఫెక్షన్స్‌ను తగ్గిస్తుంది. అంతేకాకుండా కీళ్లను బలపరుస్తుంది. చలికాలంలో లభించే ధాన్యాలను తప్పనిసరిగా రోజువారీ ఆహారంలో చేర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఉసిరి: ఉసిరి యొక్క ఆరోగ్య ప్రయోజనాల గురించి దాదాపు అందరికీ తెలుసు. రోజువారీ ఆహారంలో దీన్ని తినడం వల్ల రోగనిరోధక శక్తి బలపడుతుంది. చర్మం, జుట్టు కూడా అందంగా మారతాయి. విటమిన్ సి పుష్కలంగా ఉండటం వల్ల ఇన్ఫెక్షన్ల నుండి రక్షించడంలో సహాయపడుతుంది. ఉసిరి చట్నీ, ఊరగాయ లేదా రసం తీసి తాగాలి. ఉసిరికాయను తినడానికి ఈ మూడు మార్గాలు చాలా ఆరోగ్యకరమైనవని వైద్యులు చెప్తున్నారు.