తేగలు(Palmyra Sprouts).. ఇవి అధికంగా నవంబర్ నుంచి జనవరి మధ్య కాలంలో అధికంగా లభిస్తాయి. వీటిని చాలా మంది చిరు తిండిగా తినిపారేస్తారు. చలికాలంలో మాత్రమే లభించే ఈ తేగలు ఒక రకమైన సూపర్ ఫుడ్ అని వైద్యులు చెప్తున్నారు. వీటిని తినడం ద్వారా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని, బరువు తగ్గడంలో కూడా తేగలు కీలక పాత్ర పోషిస్తాయని నిపుణులు వివరిస్తున్నారు. వీటినే కొన్ని ప్రాంతాల్లో తాటి గేగులు అని కూడా పిలుస్తారు. వీటిని తినడం వల్ల మన శరీరానికి కావాల్సిన పోషకాలు అందిస్తాయి.
ఇవి తాటి టెంకల నుంచి మొలుస్తాయి. తాటి టెంకలను పాతి పెడితే.. కొంతకాలానికి వచ్చే మొలకలే ఈ తేగలు. వీటిని కాల్చుకుని లేదా ఉడకబెట్టుకుని అయినా తినొచ్చు. ఎలా తిన్నా వీటి నుంచి పోషకాలు పుష్కలంగా లభిస్తాయని నిపుణులు చెప్తున్నారు. తేగలు బ్లడ్ క్యాన్సర్‌ను అడ్డుకోవడంలో కూడా కీలకంగా పనిచేస్తాయి. వీటిలో విటమిన్-సీ, బీ3, బీ1, బీ2, పొటాషియం, కాల్షియం, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ వంటి పోషకాలు అధికంగా ఉండి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. మరి ఈ తేగలను చలికాలంలో తినడం ద్వారా ఎలాంటి ప్రయోజనాలు పొందవచ్చో చూద్దాం..
చర్మానికి మేలు: తేగలను(Palmyra Sprouts) పాలలో ఉడికించి, ఆ పాలను చర్మానికి రాసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. అయితే, వీటిని అధికంగా తినడం మంచిది కాదని, కడుపులో నొప్పికి కారణం కావొచ్చని నిపుణులు చెబుతున్నారు. రోజుకు రెండు తీసుకుంటే ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
బలమైన ఎముకలు: బలమైన ఎముకలు, దంతాలు ఉంటేనే మనిషి రోజూవారీ పనులు సమర్థంగా చేసుకోగలడు. ఇందుకు కాల్షియం అవసరం. తేగల్లో కాల్షియం మెండుగా ఉండటం వల్ల ఇవి కండరాలు, ఎముకలు, దంతాలను ఆరోగ్యంగా ఉంచుతాయి. ముఖ్యంగా ఎముకలను పెలుసుబారిపోయేలా చేసే ఆర్థరైటిస్ వ్యాధి ఉన్నవారికి అద్భుతమైన ఆహారంగా చెప్పొచ్చు.
జీర్ణక్రియకు మంచిది: తేగల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణక్రియ సక్రమంగా జరిగేలా చూస్తుంది. పెద్దపేగుల్లో మలినాలు చేరకుండా టాక్సిన్లను తొలగిస్తుంది. ముఖ్యంగా ఇందులో ఉండే విటమిన్-సి.. తెల్ల రక్తకణాల సంఖ్యను పెంచి, రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది.
మలబద్ధకం: చాలా మంది మలబద్దకం సమస్యతో బాధపడుతుంటారు అలాంటి వారికి తేగల్లో ఉండే ఫైబర్ గొప్పగా పనిచేస్తుంది. పేగుల కదలికలను నియంత్రించడం ద్వారా ఇది కడుపును ఖాళీ చేస్తుంది. మన శరీరం జీర్ణించుకోలేని కార్బోహైడ్రేట్లు, రక్తంలోని కొలెస్ట్రాలు, గ్లూకోజ్ స్థాయిలను తగ్గించడంలో ఇది సహాయపడుతుంది.
రక్త హీనతకు చెక్ : వీటిని తినడం వల్ల ఒంటికి రక్తం పడుతుంది. అంతేకాదు.. ఇది హిమోగ్లోబిన్ స్థాయిలను, దాని పనితీరును పెంచుతుంది. ఐరన్ పుష్కలంగా లభిస్తుంది. వీటిని ఎండలో ఆరబెట్టి పొడిగా చేసి దానికి బెల్లం కలుపుకుని తింటే మహిళల్లో రక్తహీనత సమస్య ఇట్టే తగ్గిపోతుంది.
బరువు తగ్గడానికి: బరువు తగ్గేందుకు ప్లాన్ చేసుకుంటున్న వారు కచ్చితంగా మీ డైట్ లో తాటి గేగులను చేర్చుకోండి. ఇవి తింటే కడుపు ఫుల్ గా ఉన్న భావన కలగడంతో పాటు అతిగా తినాలనే కోరికను తగ్గిస్తుంది.