వయనాడ్(Wayanad) లోక్‌సభ పోరులో కాంగ్రెస్ తరుపున ప్రియాంక గాంధీ వాద్రా పోటీ చేస్తున్నారు. ఈరోజు కౌంటింగ్ జరుగుతుండగా తొలి రౌండ్ నుంచే ప్రియాంక భారీ ఆధిక్యత కనబరుస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆమె విజయంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) జోస్యం చెప్పారు. వయనాడ్‌లో ప్రియాంక గాంధీ(Priyanka Gandhi) విజయం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. వయనాడ్ ప్రజలు ప్రియాంక గాంధీకి రికార్డు స్థాయి విజయాన్ని అందిస్తారని అన్నారు. భారీ విజయం సాధించి ప్రియాంక అతి త్వరలోనే పార్లమెంటులో అడుగు పెడతారని, ఆమె ప్రశ్నల తాకిడికి ప్రత్యర్థులు వణకడం ఖాయమని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు.
ఇదిలా ఉంటే వయనాడ్ ఓట్ల లెక్కింపులో ప్రియాంక గాంధీ ముందంజలో ఉన్నారు. 2 లక్షలకు పైగా ఆధిక్యంతో విజయం దిశగా పరుగులు పెడుతున్నారు ప్రియాంక. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వయనాడ్ నుంచి రాహుల్ గాంధీ పోటీ చేశారు. అదే సమయంలో రాహుల్.. ఉత్తర్‌ప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ నుంచి కూడా రాహుల్ పోటీ చేశారు. రెండిటిలో నెగ్గడంతో వయనాడ్ ఎంపీ స్థానానికి ఆయన రాజీనామా చేశారు. దీంతో అక్కడ ఉపఎన్నికలు నిర్వహిస్తోంది ఎన్నికల కమిషన్. వీటిలో వయనాడ్(Wayanad) నుంచి ప్రియాంక గాంధీ వాద్ర పోటీ నిలిచారు. కాగా సార్వత్రిక ఎన్నికల్లో రాహుల్(Rahul Gandhi) 3.64 లక్షల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. మరి ఆ రికార్డును ప్రియాంక అధిగమిస్తారేమో చూడాలి.