బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) చాలా రోజుల తర్వాత బయటకు వచ్చారు. జైలు నుంచి వచ్చిన తర్వాత ఆమె ప్రజలతో మమేకం కావడం ఇదే తొలిసారి. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి(Wankidi) గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురై నిమ్స్‌లో చికిత్స పొందుతున్న విద్యార్థిని శైలజను, ఆమె కుటుంబీకులను ఎమ్మెల్సీ కవిత ఈరోజు పరామర్శించారు. ఈ సందర్భంగానే విద్యార్థుల కష్టాలను ప్రభుత్వం పట్టించుకోవట్లేదని విమర్శించారు. ఇంతటి ఘోరం జరిగిన తర్వాత కూడా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం బాధాకరమని అన్నారు కవిత.
‘‘కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణలో విద్యార్థుల పరిస్థితి దయనీయంగా మారింది. ప్రభుత్వం వెంటనే స్పందించి విద్యార్థులకు నాణ్యమైన ఆహారం, శుభ్రమైన వసతిని అందించాలి. తమ పరిస్థితులకు వ్యతిరేకంగా విద్యార్థులు ధర్నా చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణం’’ అని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా విద్యార్థి శైలజ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో మాట్లాడి.. శైలజ పరిస్థితి విషమంగా ఉందని తెలుసుకుని ఆవేదన వ్యక్తం చేశారు. శైలజ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని ఆమె(MLC Kavitha) కోరారు.