Chewing Food | ప్రస్తుత పరుగుల ప్రపంచంలో చాలా మందికి ఆహారం తినడానికి కూడా సరిపడా సమయం దొరకట్లేదు. దాని వల్ల చాలా మంది ఆహారాన్ని కూడా పరుగులు పెడుతున్నట్లే తినేస్తుంటారు. ఇది అధికంగా అలవాటైపోయి నెమ్మదిగా తినడం అనే అలవాటునే మర్చిపోతారు. ఇది తీవ్ర ప్రమాదాలకు కారణమవుతుందని వైద్యులు చెప్తున్నారు. వేగంగా తినే అలవాటు ఉన్న వారు ఆహారాన్ని సరిగా నమలను కూడా నమలరు. ఇంకా సరిగ్గా చెప్పాలంటే నమలడం అనే విషయాన్ని పూర్తిగా మర్చిపోతారు.
ఇది వారికి చాలా సాధారణ అలవాటుగా అనిపించొచ్చు కానీ.. ఇది తీవ్ర ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుందని నిపుణులు చెప్తున్నారు. అయితే చాలా మంది నమలడం అంటే ఆహారాన్ని మింగడానికి అనువైనంత చిన్న ముక్కలుగా చేయడమనే అనుకుంటారని, కానీ అది కాదని వైద్యులు చెప్తున్నారు. ఆహారం బాగా నమలే అలవాటు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని, మనం ఆరోగ్యంగా ఉండటానికి కూడా నమలే అలవాటు ఎంతో సహాయపడుతుందని వైద్యులు వివరిస్తున్నారు.
జీర్ణప్రక్రియ అనేది మన కడుపులో మాత్రమే జరగదని, అది మన నోటి నుంచే మొదలవుతుందని వైద్యులు అంటున్నారు. మనం ఆహారాన్ని బాగా నమిలినప్పుడు అది చిన్నచిన్న ముక్కలుగా మారి.. సులభంగా జీర్ణమవుతుంది. దీని వల్ల ఆహారాన్ని అరిగించే సమయంలో కడుపు, పేగుల శ్రమను తగ్గిస్తోంది. అంతేకాకుండా మన లాలాజలంలో ఉండే ఎంజైమ్‌లు ఆహారంలో ఉండే కార్బోహైడ్రేట్‌లను విచ్ఛిన్నం చేస్తాయి.
అదే ఆహారాన్ని సరిగా నమిలి(Chewing Food) తినకపోతే అది తీవ్ర ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుందని, ఈ అలవాటు ఏమాత్రం మంచిది కాదని వైద్యులు అంటున్నారు. ఆహారాన్ని వేగంగా తినాలన్న ఆలోచనలో పడిపోయి సరిగా నమలడాన్ని మర్చిపోతే పలు సమస్యలు వస్తాయి. ఇవి సుదీర్ఘకలం మనల్ని ఇబ్బంది పెడతాయని వైద్య నిపుణులు అంటున్నారు. మరి ఇంతకీ ఆ సమస్యలేంటో ఒకసారి చూద్దామా..
ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం: ఆహారాన్ని సరిగా నమలకుండా తినే అలవాటు మన పూర్తి ఆరోగ్యంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుందని వైద్యులు చెప్తున్నారు. నమలడం అనేది జీర్ణక్రియకు మాత్రమే కాకుండా మొత్తం ఆరోగ్యానికి కూడా సంబంధించినదని 2023లో ప్రచురితమైన ఒక అధ్యయనం చెప్తోంది.
కడుపు ఉబ్బరం: ఆహారాన్ని నమలకుండా తినడం వల్ల పెద్దపెద్ద ఆహార ముక్కలు కడుపులోకి చేరుతాయి. అవి జీర్ణం కావడానికి సాధారణం కన్నా ఎక్కువ సమయం పడుతుంది. ఇది పేగుల్లో అసౌకర్యానికి కారణమవుతుంది. దీని వల్ల కడుపు ఉబ్బరం, గ్యాస్ ట్రబుల్, కడుపులో మంట, గుండెల్లో మంట వంటి సమస్యలు వస్తాయని వైద్యులు వివరిస్తున్నారు. ఇది గంటలపాటు ఇబ్బంది పెడుతుందని చెప్తున్నారు.
నోటి ఆరోగ్యం: సరిగా నమలకపోవడం మన నోటి ఆరోగ్యాన్ని కూడా క్షీణింపజేస్తుందని వైద్యులు వివరిస్తున్నారు. తరచుగా ఆహారాన్ని సరిగా నమలకుండా తినడం వల్ల దంతాలు, చిగుళ్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. ఆహారాన్ని బాగా నమిలి తినడం వల్ల మన దంతాలు, చిగుళ్లు ఆరోగ్యంగా, శుభ్రంగా ఉంటాయి.
బరువుపై ప్రభావం: ఆహారాన్ని వేగంగా తినేయడం వల్ల మన మెదడు.. ఆకలి, సంతృప్తికి సంబంధించిన సరైన సంకేతాలను ఇవ్వదు. నెమ్మదిగా, పూర్తిగా నమలడం వల్ల సంతృప్తికరమైన హార్మోన్లను సక్రియం చేస్తుంది. ఇది ఆకలిని తగ్గిస్తుంది. అతిగా తినడాన్ని నిరోధిస్తుంది. ఈ అలవాటు బరువు నియంత్రణలో కూడా సహాయపడుతుంది.
పోషకాల శోషణ: ఆహారాన్ని సరిగ్గా నమలకపోతే మన తీసుకునే ఆహారంలో ఉండే పోషకాలను శరీరం పూర్తిగా పొందదు. దాని వల్ల పోషకాల లోపం ఏర్పడి అది అనేక రోగాలకు దారి తీస్తుందని వైద్యులు వివరిస్తున్నారు.