ఝార్ఖండ్(Jharkhand)లో అసెంబ్లీ ఎన్నికల్లో ఇండి కూటమి ఘన విజయం సాధించింది. దీంతో రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కూటమి సన్నద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో మాజీ సీఎం, జేఎంఎం కార్యనిర్వాహక అధ్యక్షుడు హేమంత్ సోరెన్(Hemant Soren) అధ్యక్షతన కూటమి పార్టీలు ఈరోజు భేటీ అయ్యాయి. ఇందులో భాగంగానే కూటమి నేతగా హేమంత్‌ను ఎన్నుకున్నారు. అనంతరం ఆయన రాష్ట్ర గవర్నర్ సంతోష్ గంగ్వార్‌తో భేటీ అయ్యారు. ఆయనతో ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించారు.
ఝార్ఖండ్ ముఖ్యమంత్రిగా రాజీనామా చేసిన సోరెన్(Hemant Soren).. నూతన ప్రభుత్వ ఏర్పాటుకు కూటమి సిద్ధంగా ఉన్నట్లు గవర్నర్‌కు వివరించారు. దీనికి సంబంధించి భాగస్వామ్య పార్టీల అంగీకర లేఖను ఆయన గవర్నర్‌కుఅందించారు. ఝార్ఖండ్ నూతన ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ ఈ నెల 28న ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
అయితే తాజాగా ఝార్ఖండ్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హేమంత్ సోరెన్ సరికొత్త రికార్డును నెలకొల్పారు. దాదాపు 24 ఏళ్ళ పాటు ఝార్ఖండ్‌లో ఏ పార్టీ కూడా వరుసగా రెండు సార్లు గెలిచిన దాఖలాలు లేవు. అటువంటి ఈ ఎన్నికల్లో జేఎంఎం గెలవడంతో సోరెన్ ఈ రికార్డును బద్దలు కొట్టారు. అంతేకాకుండా ఎన్నికల ముందు జైలుకు వెళ్లి నేతలను విజయం వరిస్తుందని హేమంత్ సోరెన్ మరోసారి నిరూపించారు. ఝార్ఖండ్ ఎన్నికల్లో జేఎంఎం, కాంగ్రెస్ కూటమి 57 స్థానాల్లో విజయం సాధించింది. బీజేపీ 23, ఇతరులు 1 స్థానంలో విజయం సాధించారు.