డస్ట్ అలెర్జీ(Dust Allergy) అనేది చాలా సాధారణ సమస్య. కానీ చాలా ఇబ్బంది పెడుతుంది. కాస్తంత దుమ్ము లేచినా గంటల తరబడి ఇబ్బంది పెడుతుంది. ఈ సమస్య ఎక్కవగా ఉబ్బసం, శ్వాసకోశ సమస్యలు ఉన్న వారిలో ఉంటుంది. ఈ అలెర్జీ వల్ల ముక్కు కారడం, కంటి చికాకు, తుమ్ములు, గొంతు బిగుతుగా అనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. చాలా మంది ఈ సమస్య నుంచి ఉపశమనం పొందడానికి మందులను ఆశ్రయిస్తారు. ఇవి వెంటనే ఉపశమనం ఇచ్చినా అధికంగా లేదా తరచుగా వాడటం వల్ల మన ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపే ప్రమాదం ఉందని వైద్యులు అంటున్నారు.
ఈ సమస్య ఉన్న వారు కాస్తంత దుమ్ము ఉన్న ప్రాంతంలోకి వెళ్లాలన్న చాలా ఇబ్బంది పడతారు. ఇక ఇంటి క్లీనింగ్ అంటే వాళ్లకి అగ్నిపరీక్షలానే ఉంటుంది. అలాంటి వాళ్లు కొన్ని ఇంటి చిట్కాలు పాటించడం ద్వారా ఈ సమస్యకు చెక్ పెట్టొచ్చని వైద్యులు అంటున్నారు. ఈ ఇంటి రెమెడీస్ వాడటం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని, సుదీర్ఘకాలం వాడినా ఎటువంటి ఇతర సమస్యలు రావని వివరిస్తున్నారు వైద్యులు. పైగా ఈ చిట్కాలు మన శారీరక వ్యవస్థను మరింత బలపరుస్తాయని అంటున్నారు. మరి ఇంతకీ ఆ చిట్కాలేంటో ఒకసారి చూద్దామా..
తేనె, అల్లం: డస్ట్ అలెర్జీతో ఇబ్బంది పడేవారు అప్పుడే పిండిన అల్లం రసంతో తగినంత తేనె కలుపుకుని తీసుకోవాలి. ఇలా ప్రతి రోజూ ఉదయాన్నే పరగడుపున తీసుకుంటే డస్ట్ అలెర్జీ నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇది గొంతు మంటను తగ్గించడంతో పాటు రోగనిరోధక శక్తిని పెంచుతుంది. పలు అలెర్జీల లక్షణాలను నియంత్రిస్తుంది. తేనెలో ఉండే యాంటీ-బ్యాక్టీరియల్ లక్షణాలు అలెర్జీల వచ్చే ఇన్ఫెక్షన్లను నివారిస్తాయని వైద్యులు చెప్తున్నారు.
కొబ్బరి నూనె: కొబ్బరి నూనెతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని అందరికీ తెలుసు. కానీ చాలా మంది కొబ్బరి నూనెతో జుట్టు, చర్మ ఆరోగ్యం బాగా కాపాడుకోవచ్చని భావిస్తారు. కానీ శ్వాసకోశ సమస్యలకు కూడా కొబ్బరి నూనె ఎంతో అద్భుతంగా పనిచేస్తుందని వైద్య నిపుణులు చెప్తున్నారు. డస్ట్ అలెర్జీ(Dust Allergy) వచ్చి ముక్కు దిబ్బడ పడటం, గొంతు బిగుతుగా అనిపిస్తే ఆ ఇబ్బందుల నుంచి కొబ్బరి నూనెతో ఉపశమనం పొందొచ్చట. రాత్రి పడుకునే ముందు ముక్కు రంధ్రాల దగ్గర, గొంతుపైన కొబ్బరి నూనెతో మృధువుగా మర్దన చేయాలి. ఆ తర్వాత ఆ నూనెను రాత్రంతా అంతే ఉంచుకోవాలి.. ఉదయానికల్లా ఈ ఇబ్బందుల నుంచి ఉపశమనం లభిస్తుందని వైద్యులు వివరిస్తున్నారు.
రాళ్ల ఉప్పు: రాక్ సాల్ట్ దీనిని గోరువెచ్చని నీటిలో కరిగించి ముక్కులో రెండు చుక్కల చొప్పున ఆ నీరు వేసుకోవడం ద్వారా డస్ట్ అలెర్జీ సహా పలు శ్వాసకోశ సంబంధిత అలెర్జీల నుంచి ఉపశమనం అందిస్తుంది. ఇది ముక్కును ఫ్రీ చేయడంతో పాటు గొంతు వాపును కూడా తగ్గిస్తుంది. అంతేకాకుండా రాళ్ల ఉప్పును వేడి నీళ్లలో కరిగించి ఆ ఆవిరి పట్టినా సరే అలెర్జీల నుంచి ఉపశమనం పొందొచ్చని అంటున్నారు వైద్యులు. ఇది మీ నాసికా భాగాల నుండి దుమ్ము, బ్యాక్టీరియాను తొలగిస్తుంది.
జీలకర్ర, సోంపు: శ్వాసకోశ సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడే వాళ్లు సోంపు, జిలకర్రతో ఉపశమనం పొందుచ్చు. గ్లాసు నీళ్లలో చెరో చెంచా జీలకర్ర, సొంపు వేసి బాగా మరిగించాలి. ఆ నీటిని రోజుకు ఒకటి లేదా రెండు సార్లు తాగాలి. అలా చేయడం వల్ల డస్ట్ అలెర్జీ లక్షణాలు తగ్గుతాయి. అదనపు కాలుష్యాల నుంచి కూడా మనకు ఉపశమనం అందిస్తాయి. వీటితో పాటుగా ఈ నీటిని తాగడం వల్ల మన జీర్ణ వ్యవస్థకు కూడా ప్రయోజనం ఉంటుందని వైద్యులు వెల్లడిస్తున్నారు.
పసుపు, తులసి: ఈ రెండిటిని విడివిడిగా వాడితేనే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. శారీరక కాలుష్యం, అలెర్జీలు, ఇన్ఫెక్షన్లను తగ్గించడంలో ఈ రెండూ కూడా అత్యంత సమర్థవంతంగా పనిచేస్తాయి. అటువంటిది రెండిటినీ కలిపి తీసుకుంటే మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని అంటున్నారు నిపుణులు. గ్లాసు నీళ్లు తీసుకుని అందులో అర చెంచా పసుపు, 4-5 తులసి ఆకులు వేసి బాగా మరిగించి ఆ కషాయాన్ని తాగాలి. ఇది అనేక కాలుష్యాల నుంచి మన శరీరాన్ని కాపాడటమే కాకుండా ఇన్ఫెక్షన్లను కూడా తగ్గిస్తుందని వైద్య నిపుణులు అంటున్నారు. ఈ చిట్కాలు పాటించడం వల్ల అదనపు లాభాలు కూడా ఉంటాయని చెప్తున్నారు.