వివాదాల దర్శకుడు రాం గోపాల్ వర్మ(RGV) ప్రస్తుతం పరారీలో ఉన్నారంటూ వార్తలు వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ఒంగోలు పోలీసులు ఆయనను అరెస్ట్ చేయడానికి రావడంతో ఆయన పరారయ్యాడంటూ టాక్ వినిపిస్తోంది. అందుకు ఆయన ఒక్కసారిగా అజ్ఞాతంలోకి వెళ్లిపోవడమే కారణం. మొబైల్ స్విచ్ ఆఫ్ చేయడమే కాకుండా సోషల్ మీడియా ఖాతాల్లో కూడా యాక్టివ్‌గా లేరు. దానికి తోడు ఆయన సోషల్ మీడియా హ్యాండిల్స్ అన్నీ కూడా హైదరాబాద్‌లోనే ఉన్నట్లు లొకేషన్ చూపిస్తున్నప్పటికీ ఆయన తన నివాసంలో లేరు. దీంతో ఆయన ఆచూకీ కోసం ఒంగోలుకు చెందిన పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. ఇందులో భాగంగానే శంషాబాద్, షాద్‌నగర్‌లో వర్మకు ఉన్న ఫామ్‌హౌస్‌లపై పోలీసులు దృష్టి పెట్టారు. ఈరోజు సాయంత్రంలోపు ఆర్‌జీవీని అదుపులోకి తీసుకునేలా ఒంగోలు పోలీసులు గాలింపులు చేస్తున్నారు.
అయితే చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్‌ల వ్యక్తిత్వాలను కించపరిచేలా ఆయన ఎన్నికల ముందు పోస్ట్‌లు పెట్టారంటూ టీడీపీ కార్యదర్శి ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో తనకు అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలని ఆర్‌జీవీ(RGV).. కోర్టును కూడా ఆశ్రయించారు. కానీ అందుకు న్యాయస్థానం అంగీకరించలేదు. ఈ క్రమంలోనే విచారణకు హాజరుకావాలంటూ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఆయన విచారణకు హాజరుకాకపోవడంతో ఆయనను అదుపులోకి తీసుకోవడం కోసం ఒంగోలు పోలీసులు ఈరోజు హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసానికి చేరుకున్నారు.