భారత్‌లోకి అతి త్వరలోనే హైస్పీడ్ రైళ్లు ఎంట్రీ ఇవ్వనున్నాయని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్(Ashwini Vaishnaw) వెల్లడించారు. వీటి ఎంట్రీ అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని కూడా ఆయన చెప్పారు. ఈ రైళ్లను గంటకు 280 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా తీర్చిదిద్దుతున్నామని, ఈ రైళ్లను BEMLతో కలిసి చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో డిజైన్ చేసి అక్కడే తయారు చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. బీజేపీ ఎంపీ సుధీర్ గుప్తా అడిగిన ప్రశ్నకు ఇచ్చిన లిఖిత పూర్వక సమాధానంలో అశ్వినీ వైష్ణవ్ ఈ విషయాలను వెల్లడించారు. వందేభారత్ సక్సెస్ అయిన నేపథ్యంలో మేక్ ఇన్ ఇండియా స్ఫూర్తితో ఈ హైస్పీడ్ రైళ్లను తయారుచేయనున్నట్లు కేంద్రమంత్రి తెలిపారు. ఈ రైతు ఒక్కో బోగీకి ట్యాక్సులు మినహాయించి రూ.28కోట్లు ఖర్చు అవుతుందని, సాధారణ బోగీలతో పోలిస్తే ఇది చాలా ఎక్కువని ఆయన చెప్పారు.
సాధారణ రైళ్లతో పోలిస్తే ఈ హైస్పీడ్ రైళ్ల(High Speed Train) ఏరోడైనమిక్ చాలా భిన్నంగా ఉంటుందని, గాలి చొచ్చుకోకుండా ఉండేలా ఈ రైళ్ల బాడీని రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ రైళ్లలో అన్నీ చైర్ కార్సే ఉంటాయని ఆయన చెప్పారు. అంతేకాకుండా ఈ రైళ్లలో అత్యాధునిక ఫీచర్లు ఉంటాయని తెలిపారు కేంద్రమంత్రి. ఆటోమేటిక్ డోర్స్, బోగీకి బోగీ అనుసంధానం, బయటి వాతావరణానానికి అనుగుణంగా లోపలి పరిస్థితులు, సీసీటీవీ, మొబైల్ ఛార్జింగ్ సదుపాయం, ఫైర్ సేఫ్టీ పరికరాలు కూడా ఉంటాయని పేర్కొన్నారు. డిజైన్ పూర్తయిన తర్వాత ప్రాజెక్ట్ పూర్తి కావడానికి అయ్యే ఖర్చుపై ఒక అవగాహన వస్తుందని ఆయన(Ashwini Vaishnaw) వివరించారు.