మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR)పై ఐపీఎస్ అధికారుల సంఘం సీరియస్ అయింది. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా(Sandeep Kumar Jha)ను ఉద్దేశించి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది. కేటీఆర్ చేసినటువంటి నిరాధార ఆరోపణలు చెడు ప్రభావం చూపుతాయని పేర్కొంది. ఇటువంటి వ్యాఖ్యలు చేయడం బాధ్యతారాహిత్యాన్ని చూపుతున్నాయని, ఇవి ప్రజాస్వామ్యానికి హానికరమని సంఘం ఆక్షేపించింది. కలెక్టర్‌కు అండగా తాముంటామని తెలిపింది.
‘‘సివిల్ సర్వీస్ గౌరవం, స్వతంత్రత, నిష్ఫక్షపాతత్వాన్ని కాపాడటానికి మేము అండగా ఉంటాం. ఇటువంటి నిరాధార ఆరోపణలు చేయడాన్ని వెంటనే నిలిపివేయాలి. వ్యవస్థల గౌరవాన్ని, రాజ్యాంగం ద్వారా కల్పించిన న్యాయబద్దతను గౌరవించే విధంగా వ్యవహరించాలి’’ అని తెలంగాణ ఐపీఎస్ అధికారుల సంఘం పిలుపునిచ్చింది. అంతేకాకుండా కేటీఆర్ తన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది.
‘‘కొత్త కలెక్టరేట్‌లో కాంగ్రెస్ కార్యకర్త వచ్చి కలెక్టర్ రూపంలో కూర్చున్నాడు. ఆయన మన కార్యకర్తలను పార్టీ మారాలని నేరుగా మాట్లాడుతున్నాడు. ఇటువంటి సన్నాసిని కలెక్టర్‌గా తీసుకొచ్చి కక్షపూరితంగా రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఏం ఫరక్ పడదు. బీఆర్ఎస్ వెంట్రుక కూడా ఎవరూ పీకలేరు. ఈ కలెక్టర్లు, అధికారులు, పోలీసులు డ్రామాలు ఇంకెన్ని రోజులో చూద్దాం. రాసిపెట్టుకోండి.. మేము అధికారంలోకి వచ్చాక వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తాం’’ అంటూ ఇటీవల తెలంగాణ భవన్‌లో నిర్వహించిన ‘దీక్షా దివస్’లో కేటీఆర్(KTR) వ్యాఖ్యానించారు.