బంగ్లాదేశ్(Bangladesh)లో మైనారిటీల పరిస్థితి అత్యంత దుర్భరంగా తయారైంది. ఇంటి నుంచి బయటకు వస్తే మళ్ళీ తిరిగి వెళ్తామా అన్న అనుమానం కలుగుతుంది. కొన్ని ప్రాంతాల్లో అయితే మైనారిటీ హిందువుల ఇళ్లపై కూడా దాడులు జరుగుతున్నాయి. ఇటీవల బంగ్లాదేశ్ జెండాను అగౌరపరిచారనే ఆరోపణలపై ఇస్కాన్‌కు చెందిన చిన్మయ్ కృష్ణదాస్(Chinmay Krishna Das) ప్రభును ఢాకా పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన అరెస్ట్‌ను వ్యతిరేకిస్తూ బంగ్లాదేశ్‌లోని హిందువులు తీవ్రస్థాయిలో నిరసనలు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్‌లో మైనారిటీ హిందువుల భద్రత అంశంపై భారత విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్దన్ సింగ్(Keerthi Vardhan Singh) స్పందించారు. బంగ్లాదేశ్‌లోని మైనారిటీల బాధ్యత ఆ దేశ ప్రభుత్వానిదేనని ఆయన వెల్లడించారు.
‘‘బంగ్లాదేశ్(Bangladesh)లో హిందూ దేవాలయాలను అపవిత్రం చేయడం వంటి కొన్ని ఘటనలు వెలుగుచూశాయి. ఢాకాలోని తంతిబజార్‌లో ఏర్పాటు చేసిన పూజా మండపంపై దాడి, జేశోరేశ్వరి కాళీమాత ఆలయం(Jeshoreshwari Kali Temple)లో కిరీటం చోరి గురించి భారత ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. హిందువులు, మైనార్టీలకు పరిరక్షణ కల్పించాలని బంగ్లా ప్రభుత్వాన్ని కోరాం. మైనారిటీలు సహా పౌరులందరిని రక్షించే బాధ్యత ఆ దేశ ప్రభుత్వంపై ఉంది’’ అని ఆయన తెలిపారు.