నటి సమంత(Samantha) ఇంటి తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆమె తండ్రి జోసెఫ్ ప్రభు(Joseph Prabhu) శుక్రవారం తుది శ్వాస విడిచారు. తండ్రి మరణంతో సమంత శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ విషయాన్ని సమంత తన ఇన్‌స్టా వేదికగా పంచుకున్నారు. తన పోస్ట్‌లో బ్రోకెన్ హార్ట్ ఎమోజీతో పాటు ‘‘నాన్నా.. మళ్ళీ మనం కలిసేంత వరకు’’ అని రాసుకొచ్చింది సమంత. ఈ విషయం తెలిసిన అభిమానులు, నెటిజన్లు సమంతకు ధైర్యం చెప్తున్నారు. అయితే సమంత జీవితంలో ఆమె తల్లిదండ్రులు కీలక పాత్ర పోషించారు. చిన్నప్పటి నుంచి హీరోయిన్ అయిన తర్వాత కూడా వారు సమంతను సరైన దిశగా గైడ్ చేశారు. తాను చిన్నప్పుడు తనకు తన తండ్రి చెప్పిన కొన్ని మాటలు తన ఆత్మ విశ్వాసంపై ఎంతో ప్రభావం చూపించాయని పలు సందర్భాల్లో సమంత వివరించారు.
‘‘చిన్నతనంలో నేను గుర్తింపు కోసం తెగ తాపత్రయపడేదాన్ని. నేను ఏమీ తెలియని అమాయకురాలిగా మా నాన్న భావించేవారు. నన్నో చిన్నపిల్లలా చూసేవారు. మా నాన్న ఒక్కరే కాదు.. ప్రపంచంలోని తల్లిదండ్రులందరూ కూడా తమ పిల్లలను ఇలానే చూస్తారు. మా నాన్న మాటలు నాపై ఎంతో ప్రభావం చూపాయి. తొలి సినిమా అవకాశం వచ్చినప్పుడు సినిమా చేయగలనని అనుకోలేదు. సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా ప్రశంసలు అందుకోవడానికి చాలా సమయం పట్టింది. నేను నటిగా రాణించిన తర్వాత నా తల్లిదండ్రులు నన్ను చూసి ఎంతో గర్వపడ్డారు. నా పని విషయంలో సంతృప్తి చెందారు’’ అని సమంత(Samantha) గతంలో చెప్పారు.