టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్‌లో ఒకడైన పూరీజగన్నాథ్(Puri Jagannath) తాజాగా జీవితంపై యువతకు కీలక సూచన చేశారు. మన జీవితం ఎప్పుడూ ఊహించిన విధంగా సాగదని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలన్నారు. ఈ నేపథ్యంలోనే ప్లాన్-ఏ, ప్లాన్-బీ అనే కాన్సెప్ట్‌పై మాట్లాడాడు. ‘‘ఇక్కడ ఎవరి జీవితం ఎవరి చేతుల్లోనూ లేదు. అన్నీ అనుకున్నట్లు జరగవు. అందుకే మనం ఎప్పుడూ ప్లాన్-బీతో రెడీగా ఉండాలి. ప్లాన్-బీ అనేది బ్యాకప్ స్ట్రాటజీ. ఒకదారి మూసుకుపోతే ఇంకో దారిని రెడీగా ఉంచుకోవడమే ఈ ప్లాన్-బీ ఉద్దేశం. దీని వల్ల ఒత్తిడి, కంగారు తగ్గుతుంది. ప్లాన్-బీ ఎలా ఉండాలంటే.. దానిని ఇంకో మార్గంలానే చూడాలి. ప్లాన్-ఏ పూర్తి కాదని ముందే తెలుసు అనే నెగిటివ్ ఆలోచన నుంచి పుట్టకూడదు’’ అని చెప్పాడు.
‘‘ఇలా చేయడం వల్ల డిప్రెషన్‌కు గురికాకుండా ఉంటాం. మన అంతిమ గమ్యాన్ని చేరుకోవడం కోసమే జీవిస్తాం. కాలు విరిగితే కుంటుకుంటూ పోదాం. వర్షం వస్తే తడుచుకుంటూ ముందుకుసాగుతాం. మన ఎమోషన్ ఎప్పుడూ తుది గమ్యంపై ఉండాలి. ఎన్ని ప్లాన్స్ ఫెయిన్ అయినా కుంగుబాటుకు గురికావద్దు. తలుపులు అన్నీ మూసుకుపోతే చిట్టచివరికి మన దగ్గర ప్లాన్-కే ఉంటుంది. కే అంటే కిటికి. సరిగ్గా వెతికితే ఎక్కడో ఒకచోట కిటికి దొరుకుతుంది. అది చాలు దూకేయడానికి. ప్లాన్-బీ కన్నా మానసిక స్థిరత్వం చాలా ముఖ్యం’’ అని పూరి(Puri Jagannath) వివరించాడు.