గ్లామర్ ఇండస్ట్రీలో నెగ్గుకురావడం అంత ఈజీ కాదు. ఇందుకు తానేమీ మినహాయింపు కాదంటున్నారు విలక్షణ నటుడు రాజేంద్ర ప్రసాద్(Rajendra Prasad). కెరీర్ తొలినాళ్లలో తాను కూడా అనేక ఇబ్బందులు పడ్డానని, ఒకానొక సమయంలో తనకు చావే గత్యంతరం అన్న భావన కూడా కలిగిందని తన కెరీర్‌కు సంబంధించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
కెరీర్ ప్రారంభంలో అవకాశాల కోసం చాలా ఇబ్బందులు పడ్డానన్నారు. ఒకప్పుడైతే చేతిలో డబ్బులు లేక మూడు నెలలు అన్నం తినలేదని చెప్పారు. అవకాశాలు రాక ఆత్మహత్య చేసుకోవాలని నిశ్చయించుకున్నాను. అప్పుడు ఆ పని చేయనందుకు చాలా సంతోషిస్తున్నాను అని చెప్పుకొచ్చారు.
‘‘మా నాన్న టీచర్. చాలా స్ట్రిక్ట్ కూడా. ఇంజినీరింగ్ తర్వాత సినిమాల్లోకి వెళ్తా అంటే ఆయన అసహనం వ్యక్తం చేశారు. అంతేకాకుండా ‘నీ ఇష్టానికి నువ్వు వెళ్తున్నావు. సక్సెస్, ఫెయిల్యూర్ ఏదొచ్చినా నీదే బాధ్యత. ఫెయిల్ అయితే ఇంటికి కూడా రావొద్దు’ అన్నారు. అయినా వినిపించుకోకుండా మద్రాస్ వెళ్లి ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్ అయ్యా.
అక్కడ గోల్డ్ మెడల్ వచ్చింది కానీ అవకాశాలే ఒక్కటి కూడా రాలేదు. వేషాలు వచ్చేంత గ్లామర్‌గా లేనని తెలుసు. అలాంటి సమయంలో తిరిగి ఇంటికి వెళ్లా. ‘రావద్దు అన్నాను కదా ఎందుకు వచ్చావు’ అని నాన్న కోప్పడ్డారు. బాధేసింది.. వెంటనే మద్రాస్ వచ్చేశా. చచ్చిపోవాలనిపించింది. చివరిసారి ఆత్మీయులందరినీ చూద్దామని అందరి ఇళ్లకు వెళ్లి మాట్లాడా’’ అని చెప్పారు.
‘‘ఆఖరిగా నిర్మాత పుండరీకాక్షయ్య కార్యాలయానికి వెళ్ళా. అక్కడ ‘మేలుకొలుపు’ సినిమాకు సంబంధించి ఏదో గందరగోళం జరుగుతుంది. అప్పుడే బయటకు వచ్చిన ఆయన ఏమీ మాట్లాడకుండా.. నన్ను డబ్బింగ్ థియేటర్‌కు తీసుకెళ్లారు. ఒక్క ఒక చిన్న సన్నివేశానికి డబ్బింగ్ చెప్పించారు. అది ఆయనకు బాగా నచ్చేసింది. సరైన సమయానికి దొరికావు ప్రసాద్ అన్నారు.
రెండో సీన్‌కు డబ్బింగ్ చెప్పమన్నారు. అప్పుడే చెప్పా భోజనం చేసి మూడు నెలలయిందని. భోజనం పెడితే డబ్బింగ్ చెప్తా అన్నా. అవకాశాలు లేకపోవడం వల్లే ఆత్మహత్యే గత్యంతరి వచ్చానన్నా. అంతే వెంటనే ఇంటికి తీసుకెళ్లి భోజనం పెట్టించారు. ధైర్యం చెప్పారు. అలా నా డబ్బింగ్ ప్రయాణం.. ఆ తర్వాత నటుడిగా ప్రయాణం మొదలయ్యాయి’’ అని వివరించారు రాజేంద్ర ప్రసాద్(Rajendra Prasad).