బీఆర్ఎస్ ముఖ్యనేత హరీష్ రావు(Harish Rao), ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి(Padi Kaushik Reddy) అరెస్ట్‌ను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) తీవ్రంగా ఖండించారు. ఇది ప్రజా పాలన కాదు.. ఇందిరమ్మ ఎమర్జెన్సీ పాలన అంటూ కాంగ్రెస్ పరిపాలనపై విమర్శలు గుప్పించారు. ప్రజా పాలన పేరుతో కాంగ్రెస్ ఎమర్జెన్సీ పాలన కొనసాగిస్తోందని, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే వారిపై తప్పుడు కేసులు బనాయించి అరెస్ట్‌లు చేయిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు కవిత.
ఈ మేరకు ఆమె(MLC Kavitha) ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. అందులో ‘‘బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేతల చట్టవ్యతిరేక అరెస్ట్‌ను నేను తీవ్రంగా ఖండిస్తున్నారు. అక్రమంగా అరెస్ట్ చేసిన మా నేతలను వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర సీఎం రేవంత్(Revanth Reddy), డీజీపీని డిమాండ్ చేస్తున్నాను’’ అని పోస్ట్ పెట్టారు.
అయితే మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావును ఈరోజు ఉదయం గచ్చిబౌలి పోలీసులు అరెస్ట్ చేశారు. తమ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లిన క్రమంలో హరీష్ రావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే కౌశిక్ రెడ్డిపై నమోదైన కేసులో భాగంగా అతనిని అరెస్ట్ చేయడం కోసం గురువారం ఉదయాన్నే పోలీసులు.. ఆయన నివాసం దగ్గరకు చేరుకున్నారు. వారిని లోపలికి వెళ్లనీకుండా కౌశిక్ రెడ్డి అనుచరులు అడ్డుకున్నారు.
దీంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. అదే సమయంలో అక్కడకు చేరుకున్న హరీష్ రావు, జగదీశ్ రెడ్డి.. కౌశిక్ ఇంట్లోకి వెళ్లడానికి ప్రయత్నించారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఎవరో లోపలికి వెళ్లడానికి వీళ్లేదని పోలీసులు అన్నారు. దీంతో హరీష్ రావు, ఆయన అనుచరులకు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలోనే పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.