మాజీ మంత్రి, బీఆర్ఎస్ కీలక నేత హరీష్ రావు(Harish Rao)కు తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో తనపై నమోదైన ఫోన్ ట్యాపింగ్ కేసు(Phone Tapping Case)ను రద్దు చేయాలని ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌ను స్వీకరించిన న్యాయస్థానం ఈరోజు కీలక ఆదేశాలు జారీ చేసింది.
పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసులో ఆయనను అరెస్ట్ చేయొద్దని న్యాయస్థానం పోలీసులను ఆదేశించింది. ఈ కేసు విషయంలో పోలీసులు తదుపరి దర్యాప్తు చేపట్టొచ్చని, అందుకు హరీష్ రావు పూర్తిగా సహకరించాలని కోర్టు సూచించింది. హరీష్ రావుపై పోలీసులకు ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ నేత చక్రధర్‌గౌడ్‌కు నోటీసులు జారీ చేసి విచారణను వాయిదా వేసింది ఉన్నత న్యాయస్థానం.
అయితే తనపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో నమోదు చేసిన కేసు కక్షపూరిత చర్యేనని హరీష్ రావు తన పిటిషన్‌లో పేర్కొన్నారు. తనపై నమోదైందని తప్పుడు కేసు అని, రాజకీయ ప్రతీకారం కోసమే కాంగ్రెస్ తనను టార్గెట్ చేసిందని ఆయన ఆరోపించారు. అంతేకాకుండా చక్రధర్‌గౌడ్ ఫిర్యాదు చేసిన వెంటనే ప్రాథమిక దర్యాప్తు కూడా చేయకుండానే పోలీసులు కేసు నమోదు చేశారని హరీష్ రావు(Harish Rao) వివరించారు.
ఫిర్యాదులో తనకు వ్యతిరేకంగా ఏమీ లేదని, ఆ ఫిర్యాదును కట్టుకథతోనే దాఖలు చేశారని ఆరోపించారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు తనను అరెస్ట్ చేస్తే తన రాజకీయ జీవితంతో పాటు ప్రతిష్ఠకు కూడా భంగం కలుగుతుందని హరీష్ రావు వివరించారు. అంతేకాకుండా ఫోన్ ట్యాపింగ్ ఎప్పుడో జరిగితే.. ఇప్పటి వరకు ఎందుకు ఫిర్యాదు చేయలేదని ప్రశ్నించారు.