ఇందిరమ్మ ఇళ్లు పథకం(Indiramma Housing Scheme) లబ్ధిదారుల ఎంపిక కోసం తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక యాప్‌ను రూపొందించింది. ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలా ఇందులో తెలుగు వెర్షన్‌ను కూడా అందుబాటులో ఉంచింది. ఈ యాప్‌ను ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇదొక మహత్తర కార్యక్రమమని ఈ పథకాన్ని కొనియాడారు.
‘‘మా ప్రభుత్వం సంవత్సరం కాలం పూర్తి చేసుకున్న సందర్బంగా ప్రజలకు కానుకగా ఇందిరమ్మ ఇళ్లు అందిస్తున్నాం. ఇండ్లు లేని పేద ప్రజలకు ఇళ్లు నిర్మించే మహత్తర కార్యక్రమం ఇది. ప్రజల అవసరాలు తీర్చడం, వారి ఆత్మ గౌరవాన్ని పెంచడం కోసం ఇందిరమ్మ ఇళ్లు పథకాన్ని చేపట్టాం. రూ.7లక్షల కోట్ల అప్పుల భారం మా మీద గత ప్రభుత్వం వేసినా.. వారు చేసిన అప్పులు చెల్లిస్తూనే అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నాం.
కొద్ది మంది ప్రభుత్వం చేసే మంచిపనులను అడ్డుకొని ఇబ్బందులు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. పదేళ్లలో గత ప్రభుత్వం చేయలేని విధంగా ఇంటిగ్రెటెడ్ స్కూల్స్ కడుతున్నాం. విద్యార్థుల డైట్ చార్జీలు 40%పెంచాం. గత ప్రభుత్వం తప్పిదాల వల్ల విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఏ ఒక్క విద్యార్ధికి ఇబ్బంది రానివ్వం’’ అని భరోసా ఇచ్చారు ఢిప్యూటీ సీఎం Bhatti Vikramarka.