పుష్ప 2(Pushpa 2) ప్రీమియర్స్ సందర్భంగా సంధ్య థియేటర్(Sandhya Theatre)లో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మరణించింది. అల్లు అర్జున్(Allu Arjun) అక్కడకు రావడం వల్లే తన భార్య మరణించిందని, తన కుమారుడు విషమ పరిస్థితుల్లో చావు బతుకుల మధ్య కొట్టిమిట్టాడుతున్నాడని మృతురాలి భర్త భాస్కర్ ఆరోపించాడు. కాగా తాజాగా రేవతి మరణంపై అల్లు అర్జున్ స్పందించాడు. ఎక్స్ వేదికగా తన స్పందన వినిపిస్తూ ఓ వీడియోను బన్నీ షేర్ చేశాడు.
‘‘మొన్న నేను పుష్ప ప్రీమియర్స్ చూడటానికి ఆర్టీసీ క్రాస్‌రోడ్‌కు వెళ్లాను. అక్కడ జనం రద్దీ ఎక్కువ కావడంతో ఒక విషాద ఘటన చోటు చేసుకుంది. రేవతి అనే మహిళ.. ఆ తొక్కిసలాటలో తీవ్ర గాయాలు తగిలి మరణించింది. ఈ విషయం నాకు మరుసటి రోజు తెలిసింది. ఈ వార్త చదివి నేను, సుకుమార్, పుష్ప టీమ్ ఎంతో బాధపడ్డాం. 20 ఏళ్లుగా ప్రతి సినిమాకు ఒక ప్రధాన థియేటర్‌కు వెళ్లి అభిమానులతో కలిసి సినిమా చూడటం ఆనవాయితీగా వస్తుంది. ఎప్పుడూ ఇలాంటి ఘటనలు జరగలేదు. సడెన్‌గా ఇప్పుడు ఇలా జరగడాన్ని తట్టుకోలేకపోతున్నాం’’ అని అన్నాడు.
‘‘ఈ విషాద ఘటన గురించి తెలియడంతో బాధతో మనసు బరువెక్కింది. అందుకే పుష్ప సెలబ్రేషన్స్‌లో కూడా యాక్టివ్‌గా పాల్గొనలేకపోయాం. మేము సినిమాలుతీసేదే జనాలు థియేటర్‌కు వచ్చి ఎంజాయ్ చేయాలని. అలాంటిది థియేటర్‌లోనే ఇలాంటి ఘటన జరగడం తట్టుకోలేకపోతున్నాం. రేవతి(Revathi) కుటుంబానికి నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నా.
మేము ఏం చేసినా ఆ కుటుంబానికి మీరు లేని లోటు పూడ్చలేం. కానీ మీ కుటుంబం కోసం మేమున్నాం ఎప్పుడు సాయం కావాలన్నీ చేస్తాం. నా తరపున రేవతి కుటుంబానికి రూ.25లక్షలు ఇస్తున్నా. మీకోసం నేనున్నానని చెప్పడానికే ఈ డబ్బు ఇస్తున్నా. ఇప్పటి వరకు అయిన హాస్పిటల్ ఖర్చులు కూడా మేమే భరిస్తాం’’ అని బన్నీ(Allu Arjun) చెప్పుకొచ్చాడు.