తెలంగాణ అసెంబ్లీ గేటు దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శీతాకాల సమావేశాలకు హాజరుకావడానికి వచ్చిన బీఆర్ఎస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్బంగానే పలువురు బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అదుపులోకి కూడా తీసుకున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR)ను లోపలికి వెళ్లడానికి సిబ్బంది అనుమతించలేదు. అందుకు ఆయన వేసుకున్న టీషర్ట్‌ను కారణంగా చూపారు. ‘రేవంత్, అదానీ భాయ్ భాయ్’ అని ఉన్న టీషర్ల్ వేసుకుని కేటీఆర్ సహా ఇతర బీఆర్ఎస్ నేతలు అసెంబ్లీకి వచ్చారు. దాంతో వారిని లోపలికి అనుమతించకుండా సిబ్బంది అడ్డుకున్నారు. తమను అడ్డుకోవడంపై కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
‘‘ద్వంద వైఖరితో ప్రవర్తిస్తున్న కాంగ్రెస్ నిజస్వరూపాన్ని ప్రజలను తెలియజేయాలి. ఒకవైపు పార్లమెంటులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.. అదానీ(Adani), పీఎం ఒకటి అని టీషర్ట్‌లు వేసుకుంటారు. మరోవైపు రేవంత్ రెడ్డి(Revanth Reddy), అదానీ దోస్తానా చేస్తుంటారు. అందుకే మేము కాంగ్రెస్ ద్వంద వైఖరిని బట్టబయలు చేస్తున్నాం. సభలో కూడా మేము కాంగ్రెస్‌ను ఎక్స్‌పోజ్ చేస్తాం. ఇలాంటి టీషర్ట్‌లు వేసుకున్నా పార్లమెంటులోకి రాహుల్ గాంధీకి అనుమతి ఉంటే.. మేము అసెంబ్లీలోకి ఎందుకు వెళ్లకూడదు’’ అని కేటీఆర్(KTR) ప్రశ్నించారు.