లేడీ సూపర్ స్టార్ నయనతార(Nayanthara), నటుడు ధనుష్(Dhanush) మధ్య తీవ్ర వివాదం కొనసాగుతోంది. తాను నిర్మిస్తున్న సినిమాలోని కొన్ని సన్నివేశాలను నయనతార కొట్టేసిందని, వాటిని వెంటనే తొలగించాలంటూ ధనుష్.. నయన్‌కు నోటీసులు జారీ చేశాడు. ఈ విషయం టాక్ ఆఫ్ ది టౌన్‌గా సాగుతోంది. ఇందులో ఇరు పక్షాలు ఏమాత్రం వెనక్కు తగ్గడం లేదు. ఈ క్రమంలోనే తాజాగా ధనుష్ తీరును తప్పుబడుతూ నయనతార ఒక బహిరంగ లేఖ విడుదల చేసింది. దీనిపై ఆమె క్లారిటీ ఇచ్చారు.
తాను ఆ లేఖను ఎందుకు విడుదల చేయాల్సి వచ్చింది అనే మరిన్ని విషయాలను ఆమె పంచుకుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో నయనతార(Nayanthara) పాల్గొంది. అందులో ఓ విలేఖరి మాట్లాడుతూ.. ‘ధనుష్ గురించి లేఖ రిలీజ్ చేసే అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది?’ అని ప్రశ్నించాడు. దానికి స్పందించిన నయనతార.. తానెందుకు భయపడాలని అడిగింది.
‘‘తప్పు చేసిన వాళ్లు భయపడాలి. నేనే తప్పూ చేయలేదు. న్యాయమని నమ్మిన దాన్ని బయటపెట్టడానికి నేను ఎందుకు భయపడాలి? పబ్లిసిటీ కోసం ఎదుటివారి పేరు, ప్రతిష్ఠలను దెబ్బతేసే మనషిని నేను కాదు. నా డాక్యుమెంటరీ పబ్లిసిటీ కోసమే ఇదంతా చేశామని కొందరు మాట్లాడుతున్నారు. అవన్నీ అవాస్తవాలు. వీడియో క్లిప్స్‌కు సంబంధించి ఎన్ఓసీ కోసం ధనుష్‌ను సంప్రదించడానికి ఎంతో ప్రయత్నించాం. విఘ్నేష్, నేను కాల్స్ చేశాం.
కామన్ ఫ్రెండ్స్ కూడా ఫోన్స్ చేశారు. ఎంత ప్రయత్నించినా మాకు ఎన్‌ఓసీ రాలేదు. సినిమాలో వినియోగించిన నాలుగు లైన్ల డైలాగ్‌ను మా డాక్యుమెంటరీలో వాడాలనుకున్నాం. ఆ మాటలు మా జీవితానికి చాలా ముఖ్యం. దీనిపై ఆయన మేనేజర్‌ను కూడా సంప్రదించా’’ అని నయనతార చెప్పారు.