మంచు ఫ్యామిలీ వివాదం రచ్చకెక్కింది. మంచు మనోజ్, మోహన్ బాబు(Mohan Babu) మధ్య తీవ్ర వివాదం జరుగుతోంది. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం మనోజ్.. జల్‌పల్లి ఫామ్ ఫౌస్ తలుపును తోసుకుంటూ లోపలికి చొచ్చుకుంటూ వెళ్లాడు. అతడితో పాటు కొందరు జర్నలిస్ట్‌లు కూడా జల్‌పల్లి ఫామ్ హౌస్‌లోకి వెళ్లారు. అదే సమయంలో వచ్చిన మోహన్‌బాబును విలేఖరులు ప్రశ్నించే ప్రయత్నం చేశారు. కానీ తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయిన మోహన్‌బాబు.. ఓ విలేకరి చేతిలోని మైక్ తీసుకుని.. అతడిపై దాడిచేశారు.
ఈ ఘటనలో సదరు విలేకరి తీవ్రంగా గాయపడ్డాడు. అతడికి శస్త్రచికిత్స చేయాలని వైద్యులు చెప్పారు. రెండు మూడు నెలల వరకు ఆహారం కూడా తీసుకోలేడని, పైప్ సహాయంతో ఆహారాన్ని అందించాలని వైద్యులు చెప్పారు. కాగా ఈ దాడిని విలేకరుల సంఘం, విలేకరులు తీవ్రంగా ఖండిస్తున్నారు. మీ ఇంటి వివాదాన్ని రచ్చకి ఈడ్చుకున్నది కాగా.. విధుల్లో భాగంగా రిపోర్ట్ చేయడానికి వచ్చిన విలేకరిపై దాడి అమానీయమంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా సదరు ఘటనపై మోహన్ బాబు స్పందించారు. జర్నలిస్ట్‌పై దాడికి క్షమాపణలు కోరారు. ఈ మేరకు ఆయన ఎక్స్(ట్విట్టర్) వేదికగా ఓ పోస్ట్ పెట్టారు.
‘‘ఇటీవల జరిగిన దురదృష్టకర సంఘటనను అధికారికంగా ప్రస్తావించడంపై విచారం వ్యక్తం చేస్తూ ఈ లేఖ రాస్తున్నాను. వ్యక్తిగత కుటుంబ వివాదంపై మొదలై తీవ్ర ఘర్షణకు దారి తీసింది. ఈ ఘటనలో ఒక జర్నలిస్ట్ సోదరుడికి బాధ కలిగించినందుకు నాకు కూడా బాధగా ఉంది. ఈ ఘటన తర్వాత ఆరోగ్య కారణాల వల్ల 48 గంటలు ఆసుపత్రిలో చేరడం వల్ల వెంటనే స్పందించలేకపోయాను. నేను అతడి సహనాన్ని అభినందిస్తున్నా. ఆ రోజు నా ఇంటి గేటు విరిగిపోయి. దాదాపు 50 మంది వ్యక్తులు ఇంట్లోకి వచ్చారు. దీంతో నేను సహనాన్ని కోల్పోయాను. ఈ గందరగోళం మధ్య మీడియా ప్రతినిధులు అనుకోకుండా వచ్చారు.
నేను ఆ పరిస్థితిని అదుపు చేయడానికి ప్రయత్నించాను. ఆ ప్రయత్నంలో ఒక జర్నలిస్ట్‌కు గాయమైంది. ఇది చాలా దురదృష్టకరం. అతడికి, అతడి కుటుంబానికి కలిగిన బాధకు నేను తీవ్రంగా చింతిస్తున్నాను. హృదయపూర్వంగా క్షమించమని కోరుతున్నా. ఆ జర్నలిస్ట్ త్వరగాకోలుకోవాలని ఆశిస్తున్నా’’ అని మోహన్ బాబు(Mohan Babu) తన క్షమాపణ లేఖల పేర్కొన్నారు.