మీడియా తీరుపై సుప్రీం కోర్టు(Supreme Court) ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న ఆలయాల్లో వీఐపీ దర్శనం పేరుతో అదనపు ఛార్జీలు వసూలు చేసే పద్దతికి వ్యతిరేకంగా దాఖలైన పిల్‌పై జరిపిన విచారణ గురించి కొన్ని పత్రికల్లో తప్పుడు సమాచారం రావడంపై అత్యున్నత న్యాయస్థానం స్పందించింది. మీడియా తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. విజయ్ కిశోర్ గోశ్వామి అనే వ్యక్తి దాఖలు చేసిన పిల్‌ను అక్టోబర్ 25న విచారించిన తర్వాత ప్రస్తుత సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్‌ల ధర్మాసనం పలు వ్యాఖ్యలు చేసింది.
‘‘ఆలయాల్లో వీఐపీ దర్శనాలపై కోర్టులో జరిగిన విచారణపై గతంలో తప్పుగా చూపించారు. విచారణ సమయంలో సందర్భానుసారం వివిధ ప్రశ్నలు తలెత్తుతాయి. వాటిని మీడియాలో తప్పుగా, అతిశయోక్తిగా చూపించకూడదు. ఈ పరిస్థితి దేశమంతా ఉంది’’ అని ధర్మాసనం తెలిపింది. వీటిని మీడియా మానుకోవాలని, ప్రతిదాన్నీ అతిశయోక్తి చేయడం మంచిది కాదని సుప్రీంకోర్టు(Supreme Court) హెచ్చరించింది.