మోహన్ బాబుకు కోర్టులో చుక్కెదురైంది. ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయడానికి న్యాయస్థానం నిరాకరించింది. దీంతో ఆయనను జైలుకు సాగనంపడానికి పోలీసులు సిద్ధమయ్యారు. కానీ పోలీసులకు చిక్కకుండా మోహన్ బాబు(Mohan Babu) పరారీలో ఉన్నారు. ఆయన ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. శుక్రవారం సాయంత్రం నుంచి ఈ వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. జర్నలిస్ట్‌పై దాడి కేసులో అరెస్ట్ నుంచి తప్పించుకోవడానికి మోహన్ బాబు పరారయ్యారంటూ సోషల్ మీడియా కోడై కూస్తోంది. కాగా ఈ వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదని మోహన్ బాబు క్లారిటీ ఇచ్చారు. తాను ఎక్కడికీ పారిపోలేదని చెప్పారు.
‘‘నాపై తప్పుడు ప్రచారాలు జరుగుతున్నాయి. నా ముందస్తు బెయిల్ పిటిషన్‌ను న్యాయస్థానం నిరాకరించలేదు. ప్రస్తుతం నేను వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నాను. అది కూడా నా నివాసంలోనే ఉన్నాను. నేను ఎక్కడికి వెళ్లిపోలేదు. ఒక వార్తను ప్రచురితం చేసే ముందు అందులోని నిజానిజాలను ఒకసారి సరిచూసుకోవాలని మీడియాను కోరుతున్నాను’’ అని మోహన్ బాబు(Mohan Babu) వివరించారు.