Mahesh Kumar Goud – Allu Arjun | నటుడు అల్లు అర్జున్‌ను చిక్కడపల్లి పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. పుష్ప-2 ప్రీమియర్స్ సందర్భంగా హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్‌కు బన్నీ వచ్చాడు. ఆ క్రమంలో అక్కడ జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ మరణించింది. ఈ ఘటనపై బాధితుల ఫర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేశారు.
కాగా బన్నీ(Allu Arjun) అరెస్ట్ వెనక కాంగ్రెస్ ప్రభుత్వ హస్తం ఉందని, జాతీయ స్థాయి అవార్డు అందుకున్న నటుడిని ఆ విధంగా ఎలా అరెస్ట్ చేస్తారంటూ ప్రత్యర్థి పార్టీల నేతలు విమర్శల వెల్లువెత్తించారు. తాజాగా ఈ వార్తలపై టీపీసీసీ చీప్ మహేష్ కుమార్ గౌడ్ ఘాటుగా స్పందించారు. అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేయించాల్సినంత అవసరం తమకేంటని ప్రశ్నించారు.
‘‘తొక్కిసలాటలో సామాన్యురాలు ప్రాణాలు కోల్పోయింది. ఆమె కొడుకు చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. చట్టం ముందు అందరూ సమానమే. చట్టానికి ఎవరు అతీతులు కాదు. అల్లు అర్జున్ మామ మా పార్టీకి చెందిన నాయకుడే. సీఎం రేవంత్(Revanth Reddy)కి అల్లు అర్జున్ కుటుంబంతో బంధుత్వం ఉంది. తెలుగు చిత్ర సీమకి కాంగ్రెస్ పార్టీకి విడదీయరాని బంధం. ఫిల్మ్ స్టూడియోలు కట్టుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం భూములు ఇచ్చి వెసులుబాటు కల్పించడమే వల్లే చిత్ర సీమ మద్రాస్ నుంచి హైదరాబాద్ కి వచ్చింది. చరిత్ర తెలుస్కొని మాట్లాడాలి’’ అంటూ మహేష్ కుమార్(Mahesh Kumar Goud) బదులిచ్చారు.