తెలంగాణ తల్లి(Telangana Thalli) మార్పు అంశంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) మళ్ళీ మండిపడ్డారు. తెలంగాణ సంస్కృతిపై దాడిగానే కాంగ్రెస్ ఈ చర్యలకు పాల్పడిందని ఆరోపించారు. తెలంగాణ సంస్కృతిపై కాంగ్రెస్ పాలనలో జరుగుతున్న దాడులను ఖండించాలని అన్నారు. తెలంగాణ తల్లిపై ప్రేమ లేకనే మార్పులు చేశారని, ఎవరైనా తల్లిని మారుస్తారా? అని ప్రశ్నించారు కవిత. జీవితంలో ఎప్పుడూ జై తెలంగాణ నినాదం చేయని వ్యక్తి సీఎంగా ఉండటం తెలంగాణ ప్రజల దురదృష్టకరమన్నారు. తెలంగాణ తల్లి అంటే రేవంత్ రెడ్డికి ప్రేమ లేదు. అందుకే మార్పులు చేశారని మండిపడ్డారు. తెలంగాణ తల్లి విగ్రహం చేతిలో బతుకమ్మ లేకపోతే సమాజంలో స్నేహశీలత, సుహృద్భావం ఎలా కనిపిస్తుంది? అని నిలదీశారు.
‘‘నేను ఉద్యమకాలం నుంచి ఉన్న తెలంగాణ తల్లినే ఆరాధిస్తాను. ఒక చేతిలో జొన్నకర్ర, మరో చేతిలో బతుకమ్మ ధరించిన తెలంగాణ తల్లి వైభవాన్ని చాటేలా పద్యాలు, కవితలు రచించి పుస్తకాలు విడుదల చేస్తాం’’ అని కవిత తెలిపారు. ‘‘తెలంగాణ తల్లి విగ్రహాలను గ్రామ గ్రామానా ప్రతిష్ఠించే కార్యక్రమాన్ని కొనసాగిస్తాం. బతుకమ్మ అగ్రవర్ణాల పండగ అన్న వ్యాఖ్యలను వెనక్కు తీసుకుని తెలంగాణ జాతికి క్షమాపణలు చెప్పాలి. ప్రస్తుతం రేవంత్ రెడ్డి రూపొందించిన విగ్రహానికి కాంగ్రెస్ మాతగానే నామకరణం చేస్తున్నాం. ఈ మేరకు తీర్పానం చేస్తున్నాం’’ అని MLC Kavitha వివరించారు.