పుష్ప-2 ప్రీమియర్స్‌లో భాగంగా సంధ్య థియేటర్‌లో చోటు చేసుకున్న తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడిన శ్రీతేజ(Sri Teja).. సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. తాజాగా వైద్యులు ఆ బాలుడి ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్‌ను విడుదల చేశారు. బాలుడికి ఇంకా వెంటిలేటర్‌పై ఉంచే చికిత్స అందిస్తున్నామని, ఎప్పుడు కోలుకుంటాడో చెప్పలేమని అన్నారు.
కానీ ఔషదాలకు రెస్పాన్స్ ఉందని, ప్రస్తుతం శ్రీతేజ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు గుడ్ న్యూస్ చెప్పారు. ఫీడింగ్‌ను తీసుకోగలుగుతున్నాడని, అప్పుడప్పుడు ఫిట్స్ వంటివి వస్తున్నాయని, కళ్లు తెరుస్తున్నాడు అని తెలిపారు. కానీ మనుషులను గుర్తు పట్టలేకున్నాడని కిమ్స్ వైద్యులు తమ బులెటిన్‌లో వివరించారు.
హైదరాబాద్ ఆర్‌టీ ఎక్స్ రోడ్స్ దగ్గర ఉన్న సంధ్య థియేటర్లొ(Sandhya Theater) నిర్వహించిన ప్రీమియర్ షోలో అపశృతి చోటు చేసుకుంది. సినిమా రిలీజ్‌కు ముందు అక్కడకు అల్లు అర్జున్ రావడంతో అభిమానులతో థియేటర్ లోపలకు చొచ్చుకు వచ్చారు. దీంతో అక్కడ తొక్కిసలాట చోటు చేసుకుంది. ఇందులో ఓ మహిళ ప్రాణాలు కోల్పోగా, ఆమె కుమారుడు అపస్మారక స్థితిలో ఉన్నాడు. బాలుడిని రక్షించడం కోసం పోలీసు సిబ్బంది ఎంతో శ్రమించారు. అనంతరం బాలుడిని హాస్పటల్‌కు తరలించారు. అప్పటి నుంచి శ్రీతేజ(Sri Teja) అపస్మారక స్థితిలోనే ఉన్నాడు.