తెలంగాణలో ఫార్ములా ఈ కార్ రేస్ కేసు(Formula E Car Race Case)లో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేటీఆర్ కు ఈడీ నోటీసులు జారీ చేసింది. జనవరి 7న విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. ఆయనతోపాటు ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, హెచ్ఎండీఏ(HMDA) మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్ రెడ్డికి ఈడీ అధికారులు నోటీసులు పంపించారు. అరవింద్ కుమార్ జనవరి 2న విచారణకు హాజరవ్వాలని, బీఎల్ఎన్ రెడ్డి జనవరి 3న విచారణలో పాల్గొనాలని నోటీసుల్లో స్పష్టం చేశారు.
మరోవైపు ఫార్ములా ఈ కార్ రేస్ కేసు(Formula E Car Race Case) విచారణలో ఏసీబీ దూకుడు ప్రదర్శిస్తోంది. హైకోర్టులో కేటీఆర్ వేసిన క్వాష్ పిటిషన్ పై ఏసీబీ కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది. ప్రభుత్వ ఖజానా దుర్వినియోగం అయిందని అఫిడవిట్ లో పేర్కొంది. ఏకపక్ష నిర్ణయం తీసుకొని చెల్లింపులు జరిపారని కోర్టుకు వెల్లడించింది. ప్రభుత్వ అనుమతి లేకుండానే విదేశీ కంపెనీకి రూ. 54 కోట్ల చెల్లింపులు జరిపారని ఆరోపించింది. దీనివల్ల హెచ్ఎండిఏ పై అదనంగా రూ.8 కోట్ల రూపాయల భారం పడిందని తెలిపింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా, ఎన్నికల కమిషన్ అనుమతి లేకుండానే రెండో సెషన్ కి సంబంధించిన అగ్రిమెంట్ చేసుకున్నారని ఏసీబీ పేర్కొంది.
మొదటి అగ్రిమెంట్లో ప్రభుత్వం కేవలం ట్రాక్ నిర్మాణంతో పాటు సౌకర్యాలు కల్పించేలా ఒప్పందం ఉంది అని ఏసీబీ తెలిపింది. రెండో సెషన్ అగ్రిమెంట్ లో ఏర్పాట్లతో పాటు, స్పాన్సర్ అమౌంట్ కూడా హెచ్ఎండీయే చెల్లించే విధంగా ఒప్పందం కుదిరింది అని వెల్లడించింది. ఇదే జరిగి వుంటే ప్రభుత్వంపై అదనంగా రూ.600 కోట్ల అదనపు భారం పడేదని ఏసీబీ దాఖలు చేసిన అఫిడవిట్ లో తెలిపింది.