తెలంగాణలో దారుణ ఘటన చోటుచేసుకుంది. తమ భూములు లాక్కుంటున్నారని కొంతమంది రైతులు పురుగుల మందు తాగి జేసీబీ కింద పడ్డారు. జయశంకర్ భూపాలపల్లి(Bhupalpally) జిల్లా మహాదేవపూర్ మండలం ఎలికేశ్వరం గ్రామంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా ఉద్రిక్తతకు దారి తీసింది. తమ పొలాల వద్దకు కూడా రానివ్వకుండా రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు, పోలీసులు అడ్డుకుంటున్నారని గ్రామంలోని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
చిన్న కాళేశ్వరం గ్రావిటీ కెనాల్ కోసం గతంలో చేసిన సర్వే కాకుండా ఇప్పుడు కొత్తగా సర్వే చేసి, తమ భూములను లాక్కుంటున్నారని బుధవారం గ్రామంలోని రైతులు ఆందోళన చేపట్టారు. అన్యాయంగా తమ భూములను లాక్కుంటున్నారని(Land Acquisition) పురుగుల మందు తాగి, కెనాల్ గోతిలో పడుకుని నిరసన తెలిపారు.
Bhupalpally | పొలాల వద్దకు రానివ్వకుండా పోలీసులను పెట్టి రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు సర్వే నిర్వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ భూములు లాక్కొని అన్యాయం చేయవద్దంటూ బోరున విలపిస్తున్నారు. సర్వే నిలిపివేయాలంటూ కొంతమంది రైతులు పురుగుల మందు తాగి జేసీబీ కింద పడ్డారు. వెంటనే ఆ వాహనాన్ని నిలిపి రైతులను ఆసుపత్రికి తరలించారు.