వికసిత్ ఆంధ్రప్రదేశ్ విజన్ 2047కి కేంద్రం అండగా ఉంటుందని ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) హామీ ఇచ్చారు. ఏపీ పర్యటనలో భాగంగా మోదీ రూ. 2 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించారు. అనంతరం విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఏపీకి ప్రధాని వరాల జల్లు కురిపించారు. నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్‌లో భాగంగా భారత్ లో 2030 నాటికి 5 మిలియన్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన వెల్లడించారు. దేశంలో రెండు గ్రీన్ హైడ్రోజన్ హబ్‌లను ఏర్పాటు చేస్తామని, వాటిలో ఒకటి విశాఖలో వస్తుందని హామీ ఇచ్చారు.
అవకాశాల భూమికి అండగా ఉంటాం…
స్వర్ణాంధ్రప్రదేశ్‌లో భాగంగా 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ సుమారు 2.5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారాలని లక్ష్యంగా పెట్టుకుందని, ఆ కలని సాకారం చేయడంలో రాష్ట్రానికి కేంద్రం అండగా ఉంటుందని ప్రధాని భరోసా కల్పించారు. రాష్ట్రాన్ని అవకాశాల భూమిగా అభివర్ణించిన మోదీ, కొత్త భవిష్యత్ సాంకేతికతలకు కేంద్రంగా మారాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. అంతకుముందు, అనకాపల్లిలో గ్రీన్ హైడ్రోజన్ హబ్‌తో సహా అనేక ప్రాజెక్టులకు ప్రధాని వర్చువల్ గా శంకుస్థాపన చేసి ప్రారంభించారు. ఏపీ ప్రజలు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న విశాఖ రైల్వే జోన్‌కు మోదీ(PM Modi) శంకుస్థాపన చేశారు. వివిధ ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు.
మొదటి దశలో 2,500 ఎకరాల ల్యాండ్ లో రూ.1,518 కోట్లతో నిర్మించనున్న కృష్ణపట్నం పారిశ్రామిక హబ్‌కు మోదీ శంకుస్థాపన చేశారు. దీని ద్వారా 50,000 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనా. నక్కపల్లిలో రూ.1,877 కోట్లతో బల్క్ డ్రగ్ పార్కుకు శంకుస్థాపన కూడా చేశారు. 11,542 కోట్ల పెట్టుబడితో 2,002 ఎకరాల్లో నిర్మించనున్న డ్రగ్ పార్క్‌తో 54,000 మందికి ఉద్యోగాలు లభిస్తాయని అంచనా ఉంది.
ముగ్గురు నేతల భారీ రోడ్ షో..
కార్యక్రమంలో ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు నాయుడు(Chandrababu), డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan Kalyan), మంత్రి నారా లోకేష్(Nara Lokesh), ఇతర నాయకులు పాల్గొన్నారు. అంతకుముందు, నగరానికి మోడీ రాక సందర్భంగా ముగ్గురు నేతలు భారీ రోడ్ షో నిర్వహించారు. దీంతో ఆ ప్రాంతమంతా టీడీపీ(TDP), బీజేపీ(BJP), జనసేన(Janasena) పార్టీల జెండాలతో కళకళలాడింది. ఆ ప్రాంతమంతా జనసందోహంగా మారింది. ఓడరేవు నగరంలోని సంపత్ వినాయకుడి ఆలయం నుంచి ప్రారంభమైన రోడ్‌షో ఆంధ్రా యూనివర్సిటీ ఇంజినీరింగ్ కాలేజ్ గ్రౌండ్ కి చేరుకుని అక్కడ బహిరంగ సభలో పాల్గొన్నారు.
కాగా, 2024లో వరుసగా మూడోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మోడీ రాష్ట్రానికి రావడం ఇదే తొలిసారి. ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, బీజేపీ, జనసేనతో కూడిన ఎన్డీఏ కూటమి కేంద్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించింది.