Delhi Elections | ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ఫిబ్రవరి 5న ఓటింగ్ జరగనున్న నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఒక్కొక్కటిగా ఉచితాలను ప్రకటిస్తోంది. ఈ నేపథ్యంలో ఆప్ ప్రకటిస్తున్న సంక్షేమ పథకాలకు పోటీగా కాంగ్రెస్ ఇప్పటికే మహిళలకు ప్రతి నెలా రూ.2,500 ఇస్తామని ప్రకటించింది. ఈ రెండు పార్టీల ఎత్తులకు బీజేపీ కూడా పైఎత్తులు వేస్తోంది. ఆ పార్టీల హామీలకు ధీటుగా బీజేపీ కూడా ఢిల్లీ ఓటర్లకు సంచలన హామీ ఇవ్వబోతోంది అనే చర్చ నడుస్తోంది. రెండు పార్టీలకు దెబ్బకొట్టేలా ఢిల్లీ ఓటర్లను ఆకర్షించేందుకు కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. తమ మేనిఫెస్టిలో ఉచిత విద్యుత్ హామీ ప్రకటించనున్నట్లు టాక్ నడుస్తోంది. బీజేపీ ప్రవేశపెట్టబోయే కీలక ప్రతిపాదనల్లో ఒకటి ఉచిత విద్యుత్ పథకం అని సంబంధిత వర్గాలు వెల్లడిస్తున్నాయి.
ఢిల్లీ వినియోగదారులు ప్రతి నెలా 300 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్‌ను పొందుతారని పార్టీ ప్రకటించే అవకాశం ఉందని వర్గాలు తెలిపాయి. ఆప్ నేతృత్వంలోని ఢిల్లీ ప్రభుత్వం ప్రస్తుతం నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను అందిస్తోంది. ప్రస్తుత ఉచిత విద్యుత్ పథకం(Free Electricity Scheme) కింద, ఢిల్లీ ప్రభుత్వం 200 యూనిట్ల నెలవారీ వినియోగంతో వినియోగదారులకు ఉచిత విద్యుత్‌ను అందిస్తుంది. కాగా, 201-400 యూనిట్ల విద్యుత్ వినియోగించే వారికి 50 శాతం సబ్సిడీ ఇస్తారు.
Delhi Elections | మతపరమైన వర్గాలను మరింతగా ఆకర్షించేందుకు దేవాలయాలు, గురుద్వారాల వంటి మతపరమైన ప్రదేశాలకు ఈ ఉచిత విద్యుత్ పథకాన్ని ఎక్కువ యూనిట్లకు పెంచాలని బీజేపీ పరిశీలిస్తోంది. ఈ ప్రార్థనా స్థలాలు ప్రతి నెలా 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను అందించాలని పార్టీ వర్గాల్లో చర్చలు నడుస్తున్నట్టు తెలుస్తోంది. ఢిల్లీలోని గురుద్వారాలకు, దేవాలయాలకు ఉచిత విద్యుత్ అందించడానికి వేసిన ప్లాన్.. పూజారులు, గ్రాంథిలకు నెలకు రూ. 18,000 ఇస్తానని అరవింద్ కేజ్రీవాల్ ఇచ్చిన వాగ్దానానికి కౌంటర్ అని చెప్పొచ్చు.
ఇక ఢిల్లీ ప్రజలకు ఉచిత, స్వచ్ఛమైన తాగునీరు అందించడమే లక్ష్యంగా బీజేపీ పాలసీని రూపొందిస్తున్నట్లు సమాచారం. అందులో భాగంగా ప్రభుత్వం నీటి సరఫరా మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి, రాజధానిలోని ప్రతి ఇంటికి సురక్షితమైన మంచినీటిని పొందేలా చేయడానికి ప్రణాళిక వేస్తున్నట్టు సమాచారం. అంతేకాదు.. మహిళల కోసం బీజేపీ కొత్త మహిళా-కేంద్రీకృత పథకాన్ని సిద్ధం చేస్తోంది. ఈ స్కీమ్ ద్వారా ఈ ప్రాంతంలోని మహిళలకు ఆర్థిక సహాయం అందించడం, వారి ఆర్థిక శ్రేయస్సుకు తోడ్పాటు అందించడం ద్వారా సాధికారత కల్పించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పథకం మహిళా ఓటర్లలో పార్టీని బలోపేతం చేస్తుందని భావిస్తున్నారు.