ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) కీలక విమర్శలు గుప్పించారు. ప్రజావ్యతిరేకతను మూటగట్టుకోవడంలో కాంగ్రెస్ కొత్త రికార్డ్ సృష్టించిందన్నారు. పదేళ్లలో బీఆర్ఎస్ మూటగట్టుకున్న ప్రజావ్యతిరేకన్నా ఎక్కువ వ్యతిరేకతను కాంగ్రెస్ ఏడాదిలోనే తెచ్చుకుందని చురకలంటించారు. గతంలో ఎమ్మెల్సీ ఎన్నికలంటే ప్రభుత్వం గడగడలాడేదని, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేకపోవడం దురదృష్టకరమని అన్నారు కిషన్.
అతి త్వరలో రాష్ట్రంలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయని, వాటికి బీజేపీ తన అభ్యర్థులను కూడా ఇప్పటికే ప్రకటించేసిందని చెప్పారు. గతంలో గెలిచిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలంతా కూడా మూకుమ్మడిగా టీఆర్ఎస్ పంచనచేరారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఉపాధ్యాయులు, పట్టభద్రుల, రాష్ట్ర ప్రజలు గురించి మాట్లాడాల్సిన పరిస్థితి లేకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
‘‘బీఆర్ఎస్(BRS) పదేళ్ళలో మూటకట్టుకున్న వ్యతిరేకతను.. కాంగ్రెస్(Congress) ప్రభుత్వం ఏడాదిలో మూట కట్టుకుంది. జేఏసీ సంఘాలు అన్ని మద్దతు గా ఉన్నాయి. ఎన్నికల ప్రచారంలో ఉద్యోగాలను భర్తీ చేస్తామని ప్రకటన చేసింది. తేదీలతో సహా జాబ్ క్యాలెండర్ ఇచ్చింది. ఉద్యోగాల భర్తిలో కాంగ్రెస్ నిమ్మకు నిరెత్తినట్లుగా వ్యవహరిస్తుంది. కాంగ్రెస్ పార్టీ పూర్తిగా నిర్వీర్యం అయింది. రైతుల రుణమాఫీ(Crop Loan Waiver) అరాకొరగానే చేశారు. రుణమాఫీ, రైతు భరోసా, జీవో 317 ద్వారా 50 వేల మంది ఉద్యోగస్తులు ఆందోళన చెందుతున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరుతున్నాం’’ అని అన్నారు.
‘‘మోదీ కులాన్ని(PM Modi Caste) 1994లో బీసీల్లో చేర్చారు. కాంగ్రెస్ సీఎం మొహతా ఉన్న సమయంలోనే మోదీ కులాన్ని బీసీల్లో చేర్చారు. సీఎం స్థానంలో ఉన్న వ్యక్తి మాట్లాడే మాటలు కావు ఇవి. రేవంత్(Revanth Reddy) బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారు. యాదవ్, గౌడ్ లు కూడా కన్వర్టర్ బీసీలేని రేవంత్ అంటారా? మాట్లాడితే వాస్తవాలు ఉండాలి. మండల్ కమిషన్‌ను కాంగ్రెస్ తొక్కిపెడితే బీజేపీ వచ్చాకే అమలు చేసింది. 60 ఏళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ కేంద్రంలో కులగణన(Caste Census) ఎందుకు చేయలేదు. బీసీ సంఘాలే బీసీ కుల గణనలో అవకతవకలు జరిగాయని అంటున్నాయి’’ అని Kishan Reddy వివరించారు.