రాజలింగమూర్తి ఈ హత్య(Rajalinga Moorthy Murder) కేసుపై తెలంగాణ ప్రభుత్వం ఫుల్ ఫోకస్ పెట్టింది. మేడిగడ్డ ప్రాజెక్ట్ కుంగుపాటుకు బీఆర్ఎస్ ప్రభుత్వమే కారణమని కేసు వేసిన అతి కొద్దిరోజుల్లోనే రాజలింగమూర్తి హత్య జరగడంపై సీఎం కార్యాలయం ఆరా తీస్తోంది. ఈ హత్యకు సంబంధించి సమాచారం అందించాలని నిఘా వర్గాలను కోరింది. హత్యపై పూర్తి వివరాలు సేకరించాలని, దోషులు ఎవరైనా అరెస్ట్ చేయాలని ఆదేశాలిచ్చినట్లు సమాచారం. ఎట్టిపరిస్థితుల్లో నిందితులు తప్పించుకోకుండా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశాలిచ్చింది. ఇప్పటికే ఈ హత్యపై స్థానిక పోలీసుల నుంచి కూడా సీఎంఓ సమాచారం సేకరించినట్లు తెలుస్తోంది.
Rajalinga Moorthy Murder జరిగింది ఇలానే..
రాజలింగామూర్తి కుటుంబ సభ్యులు చెప్పిన వివరాల ప్రకారం.. బుధవారం తన స్వగ్రామం జంగేడు శివారు పక్కీరుగడ్డలో సోదరుల ఇంట్లో జరిగిన శుభకార్యానికి వెళ్లారు. అక్కడి నుంచి తిరిగి వస్తుండగా తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం కార్యాలయం ఎదురుగా నలుగురు నుంచి ఐదుగురు గుర్తుతెలియని వ్యక్తులు మంకీ క్యాపులు ధరించి ఆయనను చుట్టుముట్టారు. ఒక్కసారిగా కత్తులు, గొడ్డళ్లతో నరికారు. వెంటనే స్పందించిన స్థానికులు రాజలింగమూర్తిని ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారని మృతుడి కుటుంబీకులు చెప్పారు.