మహారాష్ట్రలోని మహాయుతి(Mahayuti) కూటమిలో లుకలుకలు మొదలయ్యాయా? సీఎం ఫడ్నవీష్, డిప్యూటీ సీఎం షిండే(Eknath Shinde) మధ్య అంతర్యుద్ధం జరుగుతుందా? మహాయుతిలో చీలికలు వస్తున్నాయా? అంటే రాష్ట్రంలోని వాతావరణం అవునన్న సమాధానమే ఇస్తోంది. మహారాష్ట్రలో మహాయుతి ఘనవిజయం సాధించిన తర్వాత అందరి పాత్రలు మారిపోయాయి. సీఎంగా ఉన్న షిండే కాస్తా డిప్యూటీ సీఎం అయ్యారు. డిప్యూటీ సీఎం ఫడ్నవీస్ కాస్తా సీఎం పీఠాన్ని అధిష్ఠించారు. ఈ క్రమంలోనే పలు అంశాల్లో వీరిద్దరి మధ్య సయోధ్య కుదరడం లేదని, ఇద్దరి అభిప్రాయాలు విభిన్నంగా ఉన్నాయన్న వాదనలు వినిపిస్తున్నాయి.
ఈ కారణంగానే మహాయుతిలో విభేధాలు మొదలయ్యాయన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. అటువంటివి ఏమీ లేవనిషిండే చెప్తున్నా ఈ చర్చలు మాత్రం రోజురోజుకు జోరందుకుంటున్నాయి. ఇంతలో ‘‘తనను తక్కువ అంచనా వేయొద్దు’’ అటూ షిండే చేసిన వ్యాఖ్యాలు.. అగ్నికి ఆజ్యం పోసినట్లు ఈ చర్యలను మరింత తీవ్రతరం చేశాయి. ఈ నేపథ్యంలోనే షిండే పరోక్షంగా బీజేపీ, ఫడ్నవీస్‌కే వార్నింగ్ ఇచ్చారన్న వాదన కూడా బలంగా వినిపిస్తోంది. ఇంతకీ షిండే ఏమన్నారంటే..
‘‘నన్ను తేలికగా అంచనా వేయొద్దు. వారికి ఇప్పటికే ఈ విషయం చెప్పాను. నేను సాధారణ పార్టీ కార్యకర్తను. అయితే బాబా సాహెబ్ కార్యకర్తను. ఆ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. 2022లో ఇదే విధంగా తేలికగా తీసుకున్నారు. అప్పుడు నాణెం తిరగబడింది. ప్రభుత్వాన్ని మార్చాను. ప్రజల ఆకాంక్షకు అనుగుణమైన ప్రభుత్వాన్ని తీసుకొచ్చాం. విధానసభలో ఇచ్చిన తొలి ప్రసంగంలోనే 200పైగా సీట్లు సాధిస్తామని ఫడ్నవీస్(Devendra Fadnavis) చెప్పారు. ఎన్నికల్లో 232 స్థానాలు సాధించాం. కాబట్టి నన్ను తక్కువగా అంచనా వేయొద్దు. నేను ఇస్తున్న ఈ హింట్‌ను అర్థం చేసుకునే వాళ్లు అర్థం చేసుకుంటారు. నేను నా పని చేసుకుంటూ వెళ్తా’’ అని నాగ్‌పూర్‌లో షిండే(Eknath Shinde) వ్యాఖ్యానించారు.