Kamareddy | దేశంలో గుండెపోటు కేసులు రోజురోజుకు అధికమవుతున్నాయి. చిన్నారులు, యువకులు సైతం గుండెపోటుకు బలవుతున్నారు. ఆకస్మిక వస్తున్న ఈ గుండెపోటు ఘటనలు ప్రజలకు తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. వీటికి కారణం ఏంటో తెలుసుకోవాలని వైద్యశాఖను కోరుతున్నారు. ఈ గుండెపోటు సమస్యపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని కోరుతున్నారు. కాగా శుక్రవారం కామారెడ్డిలో గుండెపోటుకు ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. వారిలో ఒకరు పదోతరగతి చదువుతున్న విద్యార్థి కాగా మరొకరు కూతురు పెళ్లి చేస్తూ మండపంలోనే గుండెపోటుకు ప్రాణాలు వదిలారు.
రామారెడ్డి మండలం సింగరాయిపల్లికి చెందిన శ్రీనిధి(Sri Nidhi) అనే పదో తరగతి విద్యార్థిని కామారెడ్డి(Kamareddy)లోని కల్కినగర్‌లో తన పెద్దనాన్న ఇంట్లో ఉంటూ ఓ ప్రైవేట్ పాఠశాలలో చదువుతోంది. శుక్రవారం ఉదయం ఇంటి నుంచి టిఫిన్ బాక్స్‌తో స్కూల్‌కు బయలుదేరింది. కాలినడకన వస్తున్న శ్రీనిధి.. పాఠశాలకు సమీపిస్తూనే ఒక్కసారిగా కుప్పకూలిపోయింది.
అది గమనించిన పాఠశాల యాజమాన్యం.. శ్రీనిధిని హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించింది. సీపీఆర్ చేసి రక్షించే ప్రయత్నం చేశారు. పరిస్థితిలో మార్పు రాకపోవడంతో అక్కడి నుంచి ఇంకో ఆసుపత్రికి తరలించారు. అక్కడా సీపీఆర్(CPR) చేస్తూ వైద్య చికిత్స అందిస్తుండగానే.. విద్యార్థిని ప్రాణాలు కోల్పోయింది. గుండెపోటుతోనే ఆమె కన్నుమూసిందని వైద్యులు ధృవీకరించారు. విద్యార్థిని మృతితో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి.
కూతురు పెళ్లి వేడుకల్లోనే తండ్రి అస్తమయం
కూతురు పెళ్లిని అట్టహాసంగా చేస్తున్న తండ్రి అదే మండపంలో ప్రాణాలు వదలడం ఇరు కుటుంబాలను శోకసంద్రంలో ముంచేసింది. అంతా ఉత్సాహంగా జరుగుతున్నాయి. కూతరును కన్యాదానం చేసిన కొద్దిసేపటికే తండ్రి కుప్పకూలిపోయారు. వెంటనే బంధువులు ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు నిర్దారించారు. దీంతో నవ వధూవరులను ఆశీర్వదిద్దామని పెళ్లికి వీచ్చేసిన చుట్టాలు.. ఆయన అంతిమయాత్రలో పాలు పంచుకోవాల్సి వచ్చిందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కాగా పెళ్లి పనులతో నిద్రలేకుండా పనిచేయడంతో ఒత్తిడి పెరిగే గుండెపోటు(Heart Attack) వచ్చి ఉంటుందని బంధువులు అభిప్రాయపడుతున్నారు.