Falcon Scam | హైదరాబాద్‌లో భారీ స్కామ్ జరిగింది. అధిక వడ్డీ ఆశ చూపి ప్రజలకు కుచ్చిటోపీ పెట్టింది ఫాల్కన్ అనే సంస్థ. తక్కువ పెట్టుబడి పెద్ద సంస్థ బడా రిటర్న్స్ అంటూ చెప్పి ప్రజలను మోసం చేశారు. ఫాల్కన్ సంస్థ స్కీమ్‌లో భారీ స్కామ్ ఉందని పోలీసులు గుర్తించారు. దీంతో వెంటనే దానిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సంస్థ ఛైర్మన్‌కు లుకౌట్ నోటీసులు కూడా సర్వ్ చేశారు. కేసు నమోదైన విషయం తెలిసిన వెంటనే ఫాల్కన్ సంస్థ ఛైర్మన్ అమర్ దీప్ సహా సీఈఓ, సీఓలు చార్టెడ్ ఫ్లైట్‌లో దుబాయ్‌కు చెక్కేశారు.
అనంతరం ఈ కేసును(Falcon Scam) సైబరాబాద్ పోలీసులు.. ఈడీకి(ED) సిఫార్సు చేశారు. దీంతో రంగంలోకి దిగిన ఈడీ కేసు నమోదు చేసి దర్యాప్తులో వేగం పెంచింది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని విమానాశ్రయాలను పోలీసులు అలెర్ట్ చేశారు. కాగా ఈ దర్యాప్తులో పలు కీలక విషయాలు వెలుగుచూశాయి.
ఈఓడబ్ల్యూ కూడా ఈ కేసుపై పూర్తి స్థాయి విచారణ చేపట్టారు. ఈ స్కీమ్ ద్వారా ఫాల్కన్ సంస్థ రూ.1700 కోట్లు వసూలు చేయగా.. అందులో కేవలం హైదరాబాద్ నుంచే రూ.850 కోట్లు వసూలు చేసింది. పెట్టుబడి దారుల నుంచి వసూలు చేసిన డబ్బును ఎప్పటికప్పుడు విదేశాలకు తరలించారు. 22 షెల్ సంస్థల ద్వారా విదేశాలకు పెట్టుబడిదారుల డబ్బును మళ్లించారు.
దుబాయ్, మలేషియా, సింగపూర్ లాంటి దేశాలకు డబ్బు చేరింది. కేసు నమోదు అవుతూనే ఫాల్కన్ సంస్థ ఛైర్మన్ అమర్ దీప్.. దుబాయ్ వెళ్లిపోయారాని ఈడీ గుర్తించింది. ఇప్పుడు వారిని పట్టుకోవడానికి, తిరిగి ఇండియాకు తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం.