వైసీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) ఎవరికో భయపడి అసెంబ్లీ కి వచ్చే నిర్ణయం తీసుకోలేదని రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి(YV Subba Reddy) అన్నారు. రాష్ట్రంలో ఉన్న అనేక సమస్యలపై చర్చిండానికే జగన్ తో పాటు పార్టీ ఎమ్మెల్యేలు సైతం అసెంబ్లీకి రావడానికి సిద్ధమయ్యారని ఆయన చెప్పారు. కక్ష సాధింపులో భాగంగానే రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం వైసీపీ(YCP) నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తూ.. ఇబ్బందులకు గురి చేస్తోందని సుబ్బారెడ్డి ఆరోపించారు. మిర్చికి సరైన మద్దతు ధర లేక రైతులు ఇబ్బంది పడుతున్నారని, వారి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని పేర్కొన్నారు.
మిర్చి రైతులను పరామర్శించి, వారి బాధలను తెలుసుకొనేందుకు వైఎస్ జగన్ గుంటూరు మిర్చి యార్డ్ కి వెళ్తే అధికారులు సరైన ప్రోటోకాల్ పాటించలేదని అన్నారు. ప్రభుత్వం భద్రత కల్పించడంలో విఫలమై, హానికలిగించే చర్యలకు పూనుకుందని మండిపడ్డారు. జగన్ ఎక్కడికి వెళ్లినా జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఇవ్వాలన్నారు. జగన్ కు ఈ ప్రభుత్వం ప్రతిపక్ష హోదా కల్పించకుండా అవమానపరుస్తోందని అన్నారు. ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లి న్యాయపోరాటం చేస్తామని వైవీ సుబ్బారెడ్డి(YV Subba Reddy) తెలిపారు.
కాగా ఏపీ 2025 -26 బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి 24న ప్రారంభం కానున్నాయి. మొదటిరోజున గవర్నర్ ప్రసంగానికి వైసీపీ 11 మంది ఎమ్మెల్యేలు హాజరుకానున్నారు. ప్రతిపక్ష హోదా దక్కకపోవడంతో ఎమ్మెల్యే గా ప్రమాణస్వీకారం చేసి అసెంబ్లీని వీడిన వైసీపీ 11 ఎమ్మెల్యేలు ఇంతవరకు అసెంబ్లీ లో అడుగు పెట్టలేదు. అయితే అసెంబ్లీ నిబంధనల ప్రకారం ఎలాంటి సమాచారం, కారణం లేకుండా సభకు 60 రోజులు నిరవధికంగా హాజరు కాకపోతే.. వారి సభ్యత్వం రద్దవుతుంది. ఈ విషయాన్ని ఇటీవల అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు అధికారికంగా స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.