వైసీపీ కోరుతున్న ప్రతిపక్ష హోదాపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan Kalyan) స్పందించారు. అసెంబ్లీ ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తున్న సమయంలో వైసీపీ(YCP) ఎమ్మెల్యేలు పోడియం వద్దకు చేరుకొని ఆయన ప్రసంగానికి అడ్డుతగిలారు. తమ పార్టీకి ప్రతిపక్ష హోదా కల్పించాలని నినాదాలు చేసారు. దీనిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. వైసీపీ కి ప్రతిపక్ష హోదా ఎప్పటికీ రాదు అని సంచలన వ్యాఖ్యలు చేసారు.
ఆ హోదా ఎవరు ఇస్తేనో రాదని.. ప్రజలు ఇస్తేనే వస్తుందని అన్నారు. గవర్నర్ కు గత నెలరోజులు ఆరోగ్య పరిస్థితి బాగోలేకపోయిన సభకు వచ్చి ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రసంగం చేస్తుంటే అడ్డుకోవడం హర్షించదగ్గ విషయం కాదని పేర్కొన్నారు. సభలో రాగానే గొడవలు పెట్టుకొని ప్రతిదానిని విభేదించాలనే ధోరణిని మానుకోవాలని వైసీపీ ఎమ్మెల్యేలకు సూచించారు. రాజ్యాంగ విలువలకు గౌరవం ఇవ్వాలని వారిని పవన్ కోరారు.
ప్రతిపక్ష హోదా పొందాలంటే రూల్స్ ఉన్నాయని.. ఈ 5 ఏళ్ళు ప్రతిపక్ష హోదా ఇవ్వబడదు అని వైసీపీ గుర్తుపెట్టుకోవాలని హితవుపలికారు. ప్రభుత్వంలో ఉన్న సీఎం చంద్రబాబు(Chandrababu), జనసేన(Janasena) డిసైడ్ చేసే విషయం కాదని ఆయన(Pawan Kalyan) తెలిపారు. సభలో లార్జెస్ట్ సెకండ్ పార్టీ అయిన జనసేన కు 21 ఎమ్మెల్యేలు ఉన్నారు. 11 ఎమ్మెల్యేలు ఉన్న వైసీపీ కి ప్రతిపక్ష హోదా ఏ విధంగా వస్తుందని మండిపడ్డారు. 175 సీట్లలో 11 సీట్లను వైసీపీ కి ఇచ్చారని సభలో హుందాగా వ్యవహరించాలని సూచించారు.